People Facing Problems due to CM Jagan Guntur Tour : గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 'వాలంటీర్లకు వందనం' సభ ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది. సీఎం రాక సందర్భంగా అధికారులు పెట్టిన ఆంక్షలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం సభకు వెళ్లే దారికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీనివల్ల చిన్నచిన్న సీసీ రోడ్ల మీది నుంచి ప్రధాన రహదారిపైకి రావడానికి వీల్లేక వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
సభ కోసం తెనాలి, వేమూరు నియోజకవర్గాల ఆర్టీసీ, స్కూలు బస్సులు, ప్రైవేటు వాహనాల్లో భారీగా జనాల్ని తరలించారు. తెనాలి మండలం అంగలకుదురు, సంగం జాగర్లమూడి మధ్యలో వారికి భోజనాలు ఏర్పాటు చేయడంతో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేశారు. ఆ మార్గంలో ఇతర వాహనాలన్నీ ఆగిపోయి దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ ఇరుక్కపోయినా పోలీసులు పట్టించుకోలేదు.
సీఎం జగన్ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా?
Volunteer Awards 2024 : సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఫిరంగిపురం హెలిప్యాడ్‌కు చేరుకోకముందే పోలీసులు ఆంక్షలు విధించారు. ఊరి బయటే బారికేడ్లు పెట్టి ప్రజలెవరినీ అనుమతించలేదు. పోలీసుల తీరుతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఫిరంగిపురంలోకి వెళ్లేందుకు స్థానికులకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో మండుటెండలోనే నడిరోడ్డుపై నిలబడ్డారు. ఇంటికి వెళ్లనివ్వమంటూ మహిళలు వేడుకున్నా సీఎం వెళ్లేదాకా రాకపోకలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డగించారు. దాదాపు అరగంట వరకు ఫిరంగిపురం బయటే ప్రయాణికులు అల్లాడిపోయారు. గాల్లో వెళ్లే సీఎం కోసం రోడ్లపై వెళ్లే వారిని ఆపడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.