Crowd at Gold Shops on the Occasion of Dhanteras:పండుగలు, శుభకార్యాల సమయంలో బంగారం కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. ధన త్రయోదశి వంటి మంచి రోజుల్లో పసిడి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవికి పూజలు చేస్తే సిరిసంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. ధన త్రయోదశిని పురస్కరించుకొని పుత్తడిని కొనుగోలు చేసేందుకు విజయవాడలోని ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారి కోసం ఇప్పటికే పలు బంగారు ఆభరణ దుకాణాల వ్యాపారస్ధులు పలు ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు.
దీపావళి అమావాస్యకు 2 రోజుల ముందు వచ్చే త్రయోదశిని ధన త్రయోదశిగా చెబుతుంటారు. దీనినే ధన్ తేరాస్ అంటారు. ధన త్రయోదశికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేవదానవులు అమృతం కోసం మథిస్తున్న పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిందంటారు. ఆమెను భార్యగా స్వీకరించిన శ్రీమహావిష్ణువు 'ఐశ్వర్యానికి అధిదేవత'గా ప్రకటించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి.
ఈ రోజున ధనాధి దేవత లక్ష్మీదేవి జన్మదినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతటి మహత్తరమైన రోజున బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసి లక్ష్మీదేవిని పూజిస్తే మరింత కలిసి వస్తుందనేది నమ్మకం. పెద్దమొత్తంలో బంగారం కొనలేకపోయినా ఒక్క గ్రామైనా బంగారమైన కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతారు.