Peddavagu Overflowed Due to Heavy Rain in Vijayawada:ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నున్న సమీపంలో ఉన్న వికాస్ కాలేజీ రోడ్డులో ఒక్కసారిగా పెద్దవాగు పొంగింది. ఒక్కసారే కురిసిన భారీ వర్షానికి 10 అడుగుల మేర రోడ్డు పైకి వరద నీరు చేరింది. వాగు అనుకోకుండా ఒక్కసారిగా పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 150 మంది పైగా కాలేజీ విద్యార్థులు, పొలాలకు వెళ్లి వచ్చే రైతులు అవతల ఒడ్డున చిక్కుకుపోయారు.
2 గంటలుగా వాగు ఉద్ధృతి పెరుగుతూనే ఉంది. సాయం కోసం విద్యార్థులు, రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు స్థానికులు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతిలో చిక్కుకున్న వారిని ఒడ్డుకు చేర్చారు. పెద్దవాగు ఉద్ధృతిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన స్పందించారు.