ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్జాతీయ స్థాయిలో రేషన్ మాఫియా - వివిధ రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టు వరకూ - PDS RICE SMUGGLING

పుదుచ్చేరితో పాటు 5 రాష్ట్రాల నుంచి కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం - దర్యాప్తునకు ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్న స్పెషల్ టీమ్స్

PDS_Rice_Smuggling
PDS Rice Smuggling (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 9:16 AM IST

PDS Rice Smuggling: రేషన్‌ బియ్యం మాఫియాకు దేశవ్యాప్త చిరునామాగా కాకినాడ మారిపోయింది. ఏపీలోని జిల్లాలే కాకుండా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి నుంచీ రేషన్ బియ్యం అక్రమ నిల్వలు ఇక్కడికి చేరాయి. కాకినాడ పోర్టు ద్వారా గత ఐదేళ్లలో వేల టన్నుల పీడీఎస్‌ (Public Distribution System) బియ్యం నిల్వలు పశ్చిమ ఆఫ్రికాలోని వివిధ దేశాలకు ఓడల్లో వెళ్లిపోయాయి. ఎగుమతి చేస్తున్న కంపెనీలకు మిల్లర్ల ద్వారా నిల్వలు వచ్చినట్లు స్పెషల్​ టీమ్స్ దర్యాప్తులో తేలింది.

పౌరసరఫరాల శాఖ ఫిర్యాదుతో 13 కేసుల్లో 137 మిల్లుల పాత్ర ఉందని గుర్తించారు. ఇందులో కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 89 మిల్లుల నుంచి బియ్యం అడ్డదారిన కాకినాడ పోర్టుకి వచ్చినట్లు బిల్లుల ఆధారంగా గుర్తించారు. మిగిలిన మిల్లుల్లో సోదాలు 2 రోజుల్లో పూర్తికానున్నాయి.

బ్లాక్​ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్​! - రేషన్‌ బియ్యం మచిలీపట్నం తరలింపు

రాజకీయ అండదండలతో అంతర్జాతీయ వ్యాపారం: మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని సరూర్‌నగర్, కరీంనగర్, కామారెడ్డి, గోదావరిఖని, నాగర్‌కర్నూల్‌ ప్రాంతాల్లోని 25 మిల్లుల నుంచి ఏపీకి పీడీఎస్‌ బియ్యం వచ్చినట్లు గుర్తించారు. యానాం, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలోని ఒక్కో ప్రాంతం నుంచి, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలోని ఆరేసి మిల్లులు, బిహార్‌లోని 8 మిల్లుల నుంచి అక్రమ బియ్యం నిల్వలను కాకినాడలోని ఎగుమతిదారులు సేకరించారు. వీటిపై దర్యాప్తునకు స్పెషల్ టీమ్స్ ఆయా రాష్ట్రాలకు వెళ్లనున్నాయి. ముంబయి, దిల్లీ కేంద్రాలుగా కొందరు చక్రం తిప్పుతూ రాజకీయ అండదండలతో ఇలా అంతర్జాతీయ వ్యాపారం చేస్తున్నారు.

అప్పుడు కేసులు పెట్టి ఇప్పుడు దర్యాప్తా?:ఈ ఏడాది జూన్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్‌ తనిఖీలు చేసి కాకినాడలోని 13 గోదాముల్లో 26 వేల 488 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గుర్తించారు. ఇటీవల తనిఖీల్లో స్టెల్లా నౌక, బార్జిలో ఏకంగా 2 వేల 384 టన్నులు వెలుగుచూశాయి. జూన్‌ నెలలలో అక్రమాలు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోకుండా, స్వాధీనం చేసుకున్న బియ్యం బ్యాంకు గ్యారంటీతో వదిలేశారు. ఆధారాలన్నీ చెరిపేసిన తర్వాత హడావుడి చేయడం, డాక్యుమెంట్స్​ ఆధారంగా కేసులు, సిట్‌ రాకలో జాప్యం మాఫియాకు ఊతమిచ్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ బిల్లులకు, మిల్లులోని ఏ, బీ రిజిస్టర్లకు పొంతన లేకపోవడంతో మూలాల శోధన కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

స్టెల్లా షిప్​​ సస్పెన్స్​కు నేడు తెర - రేషన్ బియ్యం స్వాధీనానికి సమాయత్తం

ABOUT THE AUTHOR

...view details