Pawan Kalyan Thankful for Polling Percentage Recorded in AP:ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 81.86% పోలింగ్ నమోదు కావటం ఆనందంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యులైన వారికి అభినందనలు తెలిపారు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ది, శాంతి భద్రతల కోసం ఓట్లేశారని వారి ప్రేమకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపుతున్నానని అన్నారు. పోలింగ్ సజావుగా జరిపిన ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగాన్ని పవన్ కల్యాణ్ అభినందించారు. ఎన్నికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించిన మీడియా, పౌర సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
రానున్న రోజుల్లో అందరి సహకారంతో పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం అభ్యర్థిగా ఆదరించి, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల వరకూ పోలింగ్లో ఓటింగ్ నమోదు చేశారని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూటమి పార్టీల కార్యకర్తలు వ్యవహరించారని అభినందించారు. పిఠాపురంలో తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మకు ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెడతారని విశ్వాసం వెలిబుచ్చారు. రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ గారి అనుభవం వినియోగించుకుంటానని పవన్ కల్యాణ్ తెలిపారు.