Higher fees for Naturopathy In Hyderabad: ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయంలో వైద్య సేవల ధరలు సామాన్యులు, పేదలకు అందకుండా ఉన్నాయి. కొన్ని సేవల ధరలు రెండు, మూడు రెట్లు పెరగడంతో పేద, మధ్య తరగతి రోగులు ఇబ్బందులు పడతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో వచ్చే వారికి హైదరాబాద్‌లోని అమీర్‌పేట ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం సేవలు అందిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి రోగులు వస్తుంటారు. రోగుల్లో ఈ కేంద్రానికి మంచి పేరుంది. అయితే ఎక్కువ మంది సామాన్య, మధ్య తరగతి రోగులే ఈ చికిత్సాలయానికి వస్తారు. కానీ ప్రస్తుతం పెంచిన ఛార్జీలు భారంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలు వ్యాధులకు ఇక్కడ వైద్యం : క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు పలు జీవన శైలి వ్యాధులకు ప్రకృతి చికిత్సతో అమీర్‌పేటలో వైద్యం అందిస్తారు. థైరాయిడ్, మధుమేహం, స్థూలకాయం, చర్మవ్యాధులు, మెడ, నడుము, కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, జీర్ణకోశ, శ్వాసకోశ వ్యాధులు, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, మల బద్ధకం వంటి వాటికీ ఇక్కడ ప్రకృతి చికిత్స అందిస్తారు. గర్భిణులు సాధారణ ప్రసవం అయ్యేలా యోగా, వ్యాయామాలు చేయిస్తుంటారు.
ప్రకృతి చికిత్సాలయంలో చికిత్స భారం : స్త్రీ, పురుషుల్లో నెలకొన్న సంతానోత్పత్తి, గర్భధారణ వంటి సమస్యలకు చికిత్స అందిస్తారు. ఆసుపత్రిలో ఎలాంటి రసాయనాల చికిత్స, ఆపరేషన్లు ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి వారం నుంచి నెలల పాటు చికిత్స చేస్తారు. మట్టి, జల, మర్దన, ఆహార చికిత్సలు, తానాబాత్, డీలక్స్ హైడ్రో మసాజ్, యోగా, ప్రాణాయామం, ధ్యాన క్రియలు, వాయు చికిత్స, సూర్యకిరణ్ చికిత్స, ఆథపత్ (వివిధ రకాల ఆకులను వేడి నీటిలో మరిగించి చేసే స్నానం), షట్‌కర్మల చికిత్స, వివిధ రకాల ఫిజియోథెరఫీలు, ఆక్యూపంచర్ వంటివి అందుబాటులో ఉన్నాయని చెప్పారు.