Patients Heavy Rush in Nalgonda Govt Hospital : నల్గొండ సర్కారు ఆసుపత్రిలో ఓపీ సేవలు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో బాధితులు వస్తుండటంతో ఓపీలు అందించలేకపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ఓపీ సేవలు ఉండటంతో సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వారు వెనుదిరగాల్సి వస్తుంది. ఆసుపత్రిలో కూర్చోవడానికి సరిపడా కుర్చీలు కూడా లేక, కిందనే కూర్చునే పరిస్థితి నెలకొందని రోగులు వాపోతున్నారు.
కొందరు రోగులు వరుసల్లో నిల్చోలేక, వారి వెంట తోడుగా వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులను తెచ్చుకుంటున్నారు. ఊళ్ల నుంచి రావడం ఒక ఎత్తైతే, ఓపీ సేవల వద్ద గంటల కొద్దీ పడిగాపులు కాయడం మరో ఎత్తు అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో కేవలం రెండే ఓపీ కౌంటర్లు ఉన్నాయని, వరుసల్లో గంటల కొద్దీ నిలపడినా, ముందు వరుసలో ఉన్నవాళ్లకే అవకాశం వస్తోందని, ఓపీ సమయం, కౌంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
"ఉదయం 9 గంటలకు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి ఉన్నా, ఓపీ సేవలు దొరకడం లేదు. కూర్చోవాలనుకున్నా కుర్చీలు లేవు. చాలా మంది కిందనే కూర్చుంటున్నారు. అత్యవసరం అయినా సరే ఓపీ వేగంగా దొరకడం లేదు. ఓపీ క్యూలైన్లను ఇంకో రెండు పెంచితే బాగుంటుంది. ఆధార్ కార్డు కాకుండా ఫింగర్ ప్రింట్ కూడా ఉండాలి అంట ఓపీ కోసం. అందుకే ప్రభుత్వం స్పందించి, దీనిపై తగిన నిర్ణయం తీసుకోవాలి."- రోగులు