TDP Central Office Attack Case Updates : మనం అభిమానించే జగన్‌ను టీడీపీ నాయకులు దూషిస్తే సైలెంట్‌గా ఉంటావేంటని వైఎస్సార్సీపీ కీలక నేతలు తనను రెచ్చగొట్టి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పంపారని కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. మూడు రోజుల కస్టడీలో పలు అంశాలపై అధికారులు అతణ్ని ప్రశ్నించగా గుర్తు లేదు, మరిచిపోయానని బదులిచ్చినట్లు సమాచారం. విచారణకు చైతన్య సహకరించని విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సీఐడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
CID Custody on Panuganti Chaitanya :మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఏ1 పానుగంటి చైతన్య మూడు రోజుల సీఐడీ కస్టడీలో అధికారుల విచారణకు సహకరించలేదని సమాచారం. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఉద్దేశం ఏంటి? దాడికి రెచ్చగొట్టిన వైఎస్సార్సీపీ పెద్దలు ఎవరు? వంటి ప్రశ్నలను సీఐడీ అధికారులు చైతన్యను అడగ్గా పట్టాభిపై భౌతికదాడి చేసేందుకే టీడీపీ కార్యాలయంపై దాడి చేశామని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
నాటి సీఎం జగన్‌ను టీడీపీ నాయకుడు పట్టాభి దూషిస్తే చూస్తూ మౌనంగా ఎలా ఉంటావంటూ ముఖ్య నేతలు తనను రెచ్చగొట్టినట్లు చైతన్య విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. అసలు దాడి చేసే వరకూ పట్టాభి ఎవరో కూడా తనకు తెలియదని, వైఎస్సార్సీపీ పెద్దలు చెప్పారని దాడి చేసిన విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. రెచ్చగొట్టిన ముఖ్య నేతలు ఎవరని పదే పదే ప్రశ్నించినా పేర్లు వెల్లడించకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది.
రెచ్చగొట్టి దాడికి పంపారు : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ముందు వైఎస్సార్సీపీ ఆఫీసులో ఆ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారని పానుగంటి చైతన్య సీఐడీ విచారణలో చెప్పినట్లు తెలిసింది. మూడు రోజుల సీఐడీ కస్టడీలో అతణ్ని మొదటి రోజు విచారణకు సహకరించలేదు. రెండో రోజు దాడికి సంబంధించి కీలక విషయాలను చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు తన అనుచరులు తియ్యగూర గోపిరెడ్డి, పేరూరి అజయ్, రామిశెట్టి విశాల్ తదితరులతో గుంటూరు నాజ్ సెంటర్లో ఉన్నట్లు చైతన్య చెప్పినట్లు సమాచారం. అప్పుడు వైఎస్సార్సీపీ నేత నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి ఫోన్ చేసి వెంటనే తనను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లాలని సూచించినట్లు అధికారుల ముందు చైతన్య ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.