Palamaner YSRCP MLA Controversial Comments: సీఎం జగన్ తన సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం ఇస్తారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంగవరం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బు జీతంగా ఇవ్వకూడదని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని అన్నారు. అయినా సరే ఏది ఏమైనా రానున్న 3 నెలలు సొంత డబ్బులతో జీతం ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు అని ఎమ్మెల్యే చెప్పారు.
ప్రభుత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా తన బ్రాండ్ అంబాసిడర్లకు తన సొంత నిధులతో జీతం ఇస్తానని సీఎం జగన్ చెప్పారని అన్నారు. కాబట్టి మీరంతా ఈ విషయం తెలుసుకోవాలని చెప్పారు. ఈ రోజు నుంచి వాలంటీర్లకు ఇచ్చే మూడు నెలల జీతం జగనన్న తన సొంత నిధులతో ఇస్తున్నారు అని గుర్తు పెట్టుకోండని తెలిపారు. అదే విధంగా రానున్న ఎన్నికల్లో వాలంటీర్ల సత్తా చూపించాలని ఎమ్మెల్యే వెంకటే గౌడ అన్నారు.
ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై నియోజకవర్గ ప్రజలు, టీడీపీ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు తన సొంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకున్న వాలంటీర్లకు, ఇప్పుడు సొంత డబ్బులు ఇస్తానంటే ప్రజలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మండిపడుతున్నారు.
జనం సొమ్ము తీసుకుంటూ జగన్ సేవలో గ్రామ వాలంటీర్లు
ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహం: ఎన్నికలవేళ ఎలాగైనా వాలంటీర్లను ప్రలోభ పెట్టి పార్టీ కోసం పనిచేయించుకోవాలనే దురుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. జీతాలు ఆపమని కోర్టు ఆదేశాలు ఇస్తే చంద్రబాబుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే వాలంటీర్ల సమావేశంలో మాట్లాడినట్లు లేదని, వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్లు ఉందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబుపై విషప్రచారం చేసి, వాలంటీర్ల దృష్టిలో చంద్రబాబును విలన్గా చిత్రీకరించడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తద్వారా ఎన్నికలలో లబ్ధి పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
"కోర్టు నుంచి ప్రభుత్వ నిధులు వాలంటీర్లకు ఇవ్వకూడదు అని వస్తే, మన ముఖ్యమంత్రి ఏం చెప్పారో తెలిసా. ప్రభుత్వం ఇచ్చినా, ఇవ్వకపోయినా నా బ్రాండ్ అంబాసిడర్లకు నా సొంత నిధులతో జీతం ఇస్తానని చెప్పారు. మీరంతా తెలుసుకోవాలి ఈ విషయం. ఈ రోజు నుంచి మీకు ఇచ్చే మూడు నెలల జీతం జగనన్న సొంత నిధులు అని గుర్తు పెట్టుకోండి". - వెంకటే గౌడ, ఎమ్మెల్యే
మారని వాలంటీర్ల తీరు - అధికార పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా కార్యకలాపాలు
జగన్ సొంత డబ్బులతో వాలంటీర్లకు జీతం - వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు