Palakonda Chairperson Election Postpone : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కౌన్సిలర్ రాజేశ్వరిని ఎన్నికల అధికారి వైఎస్సార్సీపీ తరఫున పరిగణలోకి తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. వైఎస్సార్సీపీ కి విధేయుడిగా పని చేస్తున్నాడంటూ ఎన్నికల అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డిని కూటమి నేతలు నిలదీశారు. జోక్యం చేసుకోవద్దంటూ ఎన్నికల అధికారి ఎమ్మెల్యే జయకృష్ణ పట్ల అమర్యాదగా వ్యవహరించారని నేతలు మండిపడ్డారు. దీంతో ఆ అధికారి తీరును తెలుగుదేశం నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకుని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అక్కడికి చేరుకున్నారు.
ఐటీడీఏ పీవో అయిన ఎన్నికల అధికారి యశ్వంత్ కుమార్ రెడ్డి వైఎస్సార్సీపీ తొత్తులా వ్యవహరిస్తున్నాడని మంత్రి పార్టీ అధిష్టానానికి తెలిపారు. అలాగే ఎన్నికల సంఘానికి యశ్వంత్ కుమార్ రెడ్డి వైఖరిపై ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలు కోరారు. ఎస్సీ మహిళకు రిజర్వ్ అయిన పాలకొండ ఛైర్ పర్సన్ పదవికి నేడు ఎన్నిక జరగాల్సి ఉంది. వైఎస్సార్సీపీ కి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కౌన్సిలర్ రాజేశ్వరి సిద్ధపడ్డారు. రాజేశ్వరి తమ పార్టీ అభ్యర్థి అంటూ వైఎస్సార్సీపీ బీఫారం ఇచ్చింది.