Onion Sales Stalled in Kurnool Market Farmers Facing Problems : ఉల్లి రైతులకు కంటి మీద కునుకే కరవైంది. పంట అమ్మకానికి తీసుకొచ్చిన వారు జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులకు ముందస్తు వ్యూహం లేకపోవడం వల్ల ఇప్పుడు కర్షకులు రోడ్డుపై పడ్డారు. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది కర్నూలు వ్యవసాయ మార్కెట్‌కు ఉల్లి పోటెత్తుతోంది. గత నెల రోజులుగా ఉల్లి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు పంటతో మార్కెట్‌కు వరుస కట్టారు. నిత్యం రికార్డు స్థాయిలో 20 నుంచి 22 వేల క్వింటాళ్ల వరకు వస్తోంది. వ్యాపారులు కొనుగోలు చేసి సరకును సకాలంలో బయటకు తరలించలేకపోయారు. ప్రస్తుతం ఆరు వేల టన్నుల వరకు ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. ఉల్లి గుట్టలు ఖాళీ చేసిన తర్వాతనే సరకును కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు రైతులంతా రోడ్లపై నిరీక్షించాల్సిందే.
3 రోజులు- 65,500 క్వింటాళ్లు :ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 17,763 హెక్టార్లలో ఉల్లి పంట సాగైంది. ఉల్లి కొనుగోళ్లకు కర్నూలు మార్కెట్ ప్రసిద్ధి. ఇక్కడికి ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులతోపాటు తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రైతులు సరకు తీసుకొస్తుంటారు. ఈ సీజన్‌లో ఆగస్టు నుంచి విక్రయాలు ప్రారంభయ్యాయి. ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులంతా మార్కెట్‌కు వరుస కట్టారు. గత మూడు రోజుల వ్యవధిలో 67,500 క్వింటాళ్లు వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సర్వర్-ఎర్రర్ :ఈ.నామ్ విధానం అమలవుతున్న విపణుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. నాలుగైదు రోజులైనా పరిష్కరించకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధర ప్రకటించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
గతంలో ఇంతకంటే అధిక మొత్తంలో అన్నిరకాల పంట ఉత్పత్తులు వచ్చిన సమయంలోనూ ఏనాడు మార్కెట్‌లో క్రయవిక్రయాలు ఆపేసిన దాఖలాలు లేవు. మార్కెట్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యాపారులు రైతులను సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారు.
నిశీధిలో తూకాలు :ఈ.నామ్ విధానం పనిచేయకపోవడంతో వ్యాపారులు మాన్యువల్‌గా టెండర్లు వేస్తున్నారు. టెండర్లు వేసే ప్రక్రియ పూర్తై ధరలు ప్రకటించేందుకు సాయంత్రం 5 నుంచి 6 గంటలవుతోంది. రాత్రి 7 గంటలకు తూకాలు మొదలు పెడుతున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు తూకాలు పూర్తి కాలేదు. బుధవారం సాయంత్రం మార్కెట్‌కు సరకును తీసుకొచ్చిన రైతు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. రేయింబవళ్లు విపణిలోనే నిరీక్షిస్తున్నారు.
అధికారుల ఘోర వైఫల్యం :నిత్యం మధ్యాహ్నం 2 గంటలలోపు ధరలు ప్రకటించి ఉల్లి క్రయ విక్రయాలు జరిగేలా చూస్తే విపణిని పూర్తిస్థాయిలో బంద్ చేసే పరిస్థితి ఉండదు.. సాయంత్రం 5-రాత్రి 7 గంటల లోపు తూకాలు పూర్తవుతాయి.
గత మూడు రోజులుగా రాత్రి వేళల్లో తూకాలు వేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది పత్తా లేకుండా పోయారు. తూకాలు ఎవరు వేస్తున్నారు.. మోసాలేమైనా జరుగుతున్నాయా అన్న విషయాన్ని పట్టించుకోలేదు.