One Man Died Due To Gun Fire: ఇంటింటికీ తిరిగి పూసలు, దండలు వంటి చిరు సామగ్రి అమ్ముకుని జీవనం సాగించే కుటుంబాలు వారివి. సంచార జీవనం చేస్తూ ఒక్కో ఊరిలో కొన్ని రోజులపాటు గుడారాలు వేసుకొని కాలం వెళ్లదీసేవారు. అలాంటి వ్యక్తులపై నాటు తుపాకీతో దుండగులు కాల్పులు జరిపిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలైయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాధవరం సమీపంలో నాటు తుపాకుల కాల్పులు కలకలం రేపాయి. గుడారాల్లో నివసిస్తూ చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారిపై తుపాకీ కాల్పులు జరగడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. పూసలు, దండలు వంటి సామగ్రి అమ్ముకుని జీవనం సాగించే కుటుంబాలు 10 రోజులుగా కాటమయ్యగుండు వద్ద గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. తెల్లవారుజామున హనుమంతు, రమణ అనే ఇద్దరు వ్యక్తులు వ్యాపారం కోసం మద్దెలకుంట గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో మార్గంలో ఉన్న గుట్ట వద్ద కాల్పులు జరిగాయి. గుట్టచాటు నుంచి దుండగులు నాటుతుపాకులతో కాల్పులు జరపడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హనుమంతు పొట్ట నుంచి తూటా వీపువైపునకు దూసుకెళ్లింది. రమణకు నడుము వద్ద తూటా తగిలింది. ఇరువురికీ తీవ్ర రక్తస్రావం కావడంతో ఇద్దరూ తమ వద్దనున్న రుమాలు, పంచెలను గాయాలకు చుట్టుకొని అతి కష్టం మీద గుడారాల వద్దకు చేరుకున్నారు. వారిని కుటుంబసభ్యులు రాయచోటి ఆస్పత్రికి తరలించగా వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ I.C.U.లో చికిత్స పొందుతూ హనుమంతు మృతిచెందారు. రమణకు చికిత్స కొనసాగుతోంది. హనుమంతుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఎవరు కాల్పులు జరిపారో తెలియడం లేదని బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కేసు నమోదు చేసిన పోలీసులు:కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు రాయచోటి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాధితులది సంబేపల్లి మండలం గా పోలీసులు గుర్తించారు. తమపై ఎవరూ కాల్పులు జరిపారో తెలియదని గాయపడిన వారు చెప్పడంతో దర్యాప్తు ఆలస్యం అవుతోందని పోలీసులు వెల్లడించారు. కానీ వీరిద్దరిలో ఒకరు మృతి చెందడం చాలా దురదృష్టకరమని పోలీసులు తెలిపారు. డబ్బులు కోసం సుఫారీ తీసుకుని నిందితులు ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉంటారేమోనని పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలో నాటు తుపాకుల తయారీ, వాటితో డబ్బుల కోసం ప్రజల్ని బెదిరించిన ఘటనలు జరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 15 రోజుల కిందటే కలికిరి మండలంలో ఇలాగే నాటు తుపాకులతో కాల్పులు జరిపి డబ్బులు లాక్కున్న ఘటనలు జరిగాయి. తాజాగా చోటుచేసుకున్న ఘటన కూడా అలాంటిదేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.