MLA Ganta on Simhachalam Prasdam :దేవాలయాల్లో ప్రసాదాల తయారీతోపాటు దీపారాధన, స్వామివారి కైంకర్యాలకు ఆవునెయ్యి వినియోగిస్తారు. ప్రముఖ ఆలయాలకు ఏళ్లతరబడి ప్రముఖ సంస్థలు నెయ్యి సరఫరా చేస్తున్నాయి. కానీ వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట వారందరినీ పక్కన పెట్టేసింది. తమకు నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టడంతో గుత్తేదారులు నాసిరకం నెయ్యి సరఫరా చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రశ్నించలేని పరిస్థితి. తిరుమల ఘటన బయటపడిన తర్వాత ఆరోగ్య భద్రతా సిబ్బంది సింహాచలంలోనూ తనిఖీలు చేపట్టి పెద్దఎత్తున నెయ్యి సీజ్ చేయడం కలకలం రేపుతోంది.
సింహాచలం ఆలయానికి గతంలో విశాఖ డెయిరీ నెయ్యి సరఫరా చేసేది. 2019-20 మధ్య కిలో రూ.591 చొప్పున సరఫరా చేయగా ఆ తర్వాత ఏడాదీ అదే ధరకు సరఫరా చేసింది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ తర్వాత రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకు కొనుగోలు చేసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా అన్నప్రసాదాల తయారీ విభాగాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెయ్యి ఎంతరేటుకు కొనుగోలు చేస్తున్నారని ఆరా తీశారు. కేవలం రూ.341కే గుత్తేదారుడు సరఫరా చేస్తున్నాడని తెలుసుకుని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Simhachalam Prasdam Ghee Issue : అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించగా అధికారులు నీళ్లు నమిలారు. ఆహార భద్రతా సిబ్బంది నెయ్యి శాంపిల్స్ సేకరించగా పసుపు రంగులో ఎలాంటి వాసన లేకుండా ఉండటాన్ని గుర్తించారు. శాంపిల్స్ ప్రయోగశాలకు పంపించామని అప్పటి వరకు ఈ నెయ్యి వినియోగించవద్దని సీజ్ చేశారు. సింహాచలం ఆలయానికి రూ.341కే నేతిని సరఫరా చేస్తున్న రైతు డెయిరీ అన్నవరం ఆలయానికి మాత్రం ఇదే బ్రాండ్, ఇదే నెయ్యిని రూ.500కు పైగా అందిస్తోంది. పరీక్షల నివేదిక వస్తే నేతి స్వచ్ఛత నిర్థారణ కానుంది. నెయ్యితోపాటు అన్నప్రసాదానికి వినియోగిస్తున్న ఇతర సామగ్రి శాంపిల్స్ సైతం ఆహార భద్రతా సిబ్బంది సేకరించింది.