NTR Vardhanthi 2025 :టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు. ఆయన మరణించి నేటికి 29 ఏళ్లు గడిచిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ ఘాట్‌కు చేరుకుని అంజలి ఘటించారు. నటనలో ప్రయోగాలు చేసిన నటనా ప్రావీణ్యుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు.
నందమూరి తారక రామారావు విప్లవాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి నుంచి టీడీపీ పుట్టిందని పేదలకు ఉపయోగపడే పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ అంటే నటనకు నిర్వచనం నవరసాలకు అలంకారమని చెప్పారు. నందమూరి తారక రామారావు అంటే ఒక వర్సిటీ అని జాతికి మార్గదర్శమని పేర్కొన్నారు. అటువంటి వారికి మరణం ఉండదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీని స్థాపించారని నందమూరి రామకృష్ణ వివరించారు. 9 నెలల్లోనే తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను సీఎం చేశారని గుర్తుచేశారు. ప్రాంతాలు వేరైనా తెలుగు వారంతా ఒకటేనని నందమూరి తారక రామారావు చాటారని చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు.
Lokesh Tribute at NTR Ghat Hyderabad : నాడు ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. అనేక సంస్కరణలు తెచ్చారని చెప్పారు. టీడీపీ కోటి మంది సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని తెలిపారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలోకి ఎదగాలని ఆకాంక్షించారు. నందమూరి తారక రామారావు రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనమని లోకేశ్ వెల్లండించారు.