NTR Cine Vajrotsavam in Connecticut :నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) మొదటి సినిమా మనదేశం 1949లో విడుదలై ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా 'తారకరామం-అన్నగారి అంతరంగం' శీర్షికతో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఆయన సినీ నట వజ్రోత్సవాల్ని అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా అమెరికాలోని కనెక్టికట్లో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమానికి ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ వైస్ ఛైర్మన్ అశ్విన్ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'తారకరామం-అన్నగారి అంతరంగం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తరణి పరుచూరి, యోగేష్ అబ్బూరి, ఉత్తేజ్ రావెళ్ల, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ సినీ జీవిత ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, పార్శ్వాలకు సంబంధించి వివిధ సందర్భాల్లో, ఇంటర్వ్యూల్లో ఆయనే చెప్పిన విశేషాలతో పాటు, ఆయన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, నటుడిగా, నటనా వైదుష్యం, దర్శకుడిగా, నిర్మాతగా భిన్నపాత్రల్ని సమర్థంగా నిర్వహించిన తీరును తారకరామం పుస్తకంలో పొందుపర్చారు. ఆయనతో పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు పాత్రికేయులు వెల్లడించిన అంశాల సమాహారంగా తీర్చిదిద్దారు.