NO Salaries for Sihmct Employees last 20 months in Tirupati : పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని తిరుపతి స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ మూసివేత దిశగా అడుగులు వేస్తుంది. 2009లో రాష్ట్రంలోనే ఏకైక ప్రభుత్వ రంగ హోటల్ మేనేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్ గా ప్రారంభించి ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దయనీయ స్థితికి చేరుకుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 20 నెలలుగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలతో విద్యార్థుల ప్రవేశాలు లేక వెలవెలబోతోంది. అలాగే స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితికి చేరుకుంది.
స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ను 2009లో తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో 2013 నుంచి అందుబాటులోకి తెచ్చారు. దీన్నిఐదెకరాల సువిశాల ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. కరోనా ముందు వరకు ఇక్కడ ప్రవేశాల కోసం విపరీతమైన గిరాకీ ఉండగా నిర్వహణ లోపంతో ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయి. అప్పటి వరకు 38 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తుండగా 20 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇప్పుడు నాలుగు విభాగాలకు నలుగురు బోధనా సిబ్బంది, 11 మంది బోధనేతర సిబ్బంది మాత్రమే మిగిలారు. వారందరూ దాదాపుగా 20 నెలల జీతం కోసం ఎదురుచూస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు.