NHAI Prepares New DPR For Cutting Nizampatnam To Guntur Highway : బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం హార్బర్ నుంచి గుంటూరు వరకు నిర్మించాల్సిన హైవేలో కోతపెట్టేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ప్రయత్నిస్తోంది. నిజాంపట్నం నుంచి గుంటూరు వద్ద కోల్‌కతా- చెన్నై జాతీయరహదారి వరకు నిర్మించాల్సి ఉన్న హైవేను కేవలం చందోలు వద్ద కత్తిపూడి-ఒంగోలు హైవేకి కలిపితే చాలనే కొత్త ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. దీనివల్ల నిజాంపట్నం హార్బర్‌కు కీలకమైన కోల్‌కతా- చెన్నై హైవేతో ఉండదు. అలాగే రాజధాని అమరావతికీ అనుసంధానం కూడా ఉండదు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు, నౌకాశ్రయాలను జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రాజెక్టులను ఎన్‌హెచ్‌ఏఐ మంజూరుచేస్తోంది.
ఇందులోభాగంగానే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చందోలు, నారాకోడూరు మీదుగా గుంటూరు శివారులో ఉన్న బుడంపాడు వద్ద కోల్‌కతా- చెన్నై జాతీయరహదారి వరకు మొత్తం 53 కి.మీ. హైవే నిర్మించేందుకు సంబంధిత అధికారులు ఎలైన్‌మెంట్‌ను సైతం సిద్ధం చేశారు. ఇది నాలుగు వరుసల హైవేగా ఉంటుంది. ఇంతలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కొత్త మెలికపెట్టింది. హార్బర్ నుంచి NHలకు కలపడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం దగ్గరలో ఉన్న కత్తిపూడి- ఒంగోలు ఎన్‌హెచ్‌లోని చందోలు వరకు 18 కి.మీ. హైవే నిర్మిస్తే చాలని సూచించింది. దీంతో ప్రస్తుతం ఈ ఎలైన్‌మెంట్ ప్రతిపాదననూ సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఈ రెండింటిలో ఎన్‌హెచ్‌ఏఐ దేనికి మొగ్గుచూపుతుందనేది కీలకం కానుంది.
రాజధానికి కనెక్టివిటీ అవసరం
- ఎన్‌హెచ్‌ఏఐ కేవలం ఖర్చు గురించి ఆలోచించి నిజాంపట్నం నుంచి గుంటూరు వరకూ నిర్మించాల్సిన హైవే కేవలం చందోలు వరకు మాత్రమే నిర్మిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.
- మిగిలిన చందోలు నుంచి గుంటూరు వరకు 35 కి.మీ రహదారిని నాలుగు వరుసలగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం కష్టమే. ఎందుకంటే ఇందుకు సంబంధించిన భూసేకరణ, నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేయాల్సిన వస్తొంది.
- ఎన్‌హెచ్‌ఏఐ మొదట ప్రతిపాదించిన విధంగానే హార్బర్ నుంచి నేరుగా గుంటూరు వరకు హైవే నిర్మించి కనెక్టివిటీ కల్పిస్తేనే అన్నివిధాలా ప్రయోజనం ఉంటుంది. దీనివల్ల హార్బర్‌కు, రాజధాని అమరావతి ప్రాంతానికి అనుసంధానం ఏర్పడుతుంది. అదేవిధంగా చందోలు- గుంటూరు మధ్య ఉన్న పొన్నూరు, నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయి.
- అయితే రాష్ట్రప్రభుత్వం ఈ హైవేపై పట్టుబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తేనే నిజాంపట్నం నుంచి గుంటూరు వరకు 53 కి.మీ. ఎలైన్‌మెంట్ మంజూరుకు అవకాశం ఉంటుంది.