Illegal Sand Mining in AP: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వుతున్నారన్న ఫిర్యాదులపై స్పందించిన ఎన్జీటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నదుల్లో తక్షణం తవ్వకాలు ఆపేయాలని, కొత్తగా ఈసీలు తీసుకున్నాకే తవ్వకాలు చేపట్టాలని గత ఏడాది మార్చి 23న ఆదేశాలిచ్చింది. అరణియార్ నదిలో 18 రీచ్‌ల్లో జేపీ పవర్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందంటూ18 కోట్లు జరిమానా విధించింది. దీనిపై జేపీ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా జరిమానాపై స్టే లభించింది. కానీ ఎన్జీటీ ఆదేశించినట్లు కొత్తగా ఈసీలు తీసుకొన్నాక ఇసుక తవ్వాలని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. అయినా సరే ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ పిటిషనర్ నాగేంద్రకుమార్ మళ్లీ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎంఓఈఎఫ్‌తో కూడిన సంయుక్త కమిటీ నివేదిక ఇవ్వాలని, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రీచ్‌లను పరిశీలించి నివేదికలు ఇవ్వాలని ఎన్జీటీ గతంలో ఆదేశించింది.
అనుమతి లేకున్నా తవ్వకాలు:ఎన్జీటీ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిస్థితిని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నివేదిక రూపంలో సమర్పించింది. ఇసుక తవ్వకాల్లో పెద్దఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఇసుక తవ్వకాలకు కొత్తగా పర్యావరణ అనుమతులు జారీ చేయలేదని అయినా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నారని నివేదికలో పేర్కొంది. ఒక్కో రీచ్ నుంచి రోజుకు వెయ్యి నుంచి 2 వేల టన్నుల ఇసుక తరలిస్తున్నారని చేతిరాతతో వేబిల్లులు ఇస్తున్నారంది. కంప్యూటరైజ్డ్ బిల్లులు, సీసీ కెమెరాలు లేవని, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ కూడా లేదని ఇలా అడుగడుగునా ఉల్లంఘనలేనని స్పష్టం చేసింది. జిల్లాల వారీగా రీచ్ వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం, గనుల శాఖ అవేవీ ఇవ్వలేదంది. ఏపీలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయంటూ ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టేసింది. అయితే దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇసుక తవ్వకాలే జరగడం లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లు ఒకే విధంగా ఇచ్చిన నివేదికను చూసి ఎన్జీటీ నిర్ఘాంతపోయింది. తాము పరిశీలించిన రీచ్‌ల్లో గతంలోగానీ, ఇప్పుడు గానీ ఇసుక తవ్వకాలు జరుగుతున్న దాఖలాలే కనిపించలేదంటూ కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై విస్మయం వ్యక్తం చేసింది.
కలెక్టర్ల నివేదికపై ఎన్జీటీ విస్మయం: ఎన్జీటీ ఆదేశాలు ఉన్నప్పటికీ ఈసీలు లేకుండా భారీ యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారంటూ పిటిషనర్ గతంలో ఎన్జీటీ దృష్టికి తీసుకురావడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని ఎంవోఈఎఫ్ అన్ని జిల్లాల కలెక్టర్లను సైతం ఆదేశించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాల కలెక్టర్లు నివేదికలు అందజేశారని ఎన్జీటీ పేర్కొంది. అయితే ఎక్కడా ఇసుక తవ్వకాలు జరగడం లేదంటూ అన్ని జిల్లాల కలెక్టర్లూ ఒకేలా నివేదిక ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసినపుడు రీచ్‌ల్లో యంత్రాలు లేవని, ఇసుక తవ్వడం లేదని ఎలా పేర్కొన్నారని ప్రస్తావించింది. గతంలోగానీ, ఇటీవల గానీ ఆ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరిగినట్లే లేదని పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణించింది.
రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్ సర్కారు సమాధానమేంటీ
నివేదికలో ఏముందంటే: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనవరి 17 నుంచి 19 వరకు ఇసుక రీచ్‌లు తనిఖీలు చేయగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని 2021 నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయంటూ ఎంవోఈఎఫ్ కమిటీ మంగళవారం ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. బుధవారం నాటి విచారణలో ఆ నివేదికలోని అంశాలను ఎన్జీటీ ప్రస్తావించింది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 8 రీచ్‌లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6 రీచ్‌లను తనిఖీ చేయగా వేటికీ సియా ఈసీలు, కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్సెంట్ ఫర్ ఆపరేషన్ అనుమతులు కూడా లేవని అయినా వాటిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంది. ఆ రీచ్‌ల్లో జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2 నుంచి 2.2 టన్నుల బకెట్ సామర్థ్యంతో ఉండే జేసీబీలు, హిటాచీలతో దర్జాగా ఇసుక తవ్వేస్తోందంది. రోజుకు సగటున 2 వేల టన్నుల వరకు ఇసుక తవ్వితీసి టన్ను 475 చొప్పున విక్రయిస్తున్నారని నివేదికలోని అంశాలను ప్రస్తావించింది. ఎంవోఈఎఫ్ జారీచేసిన సుస్థిర ఇసుక తవ్వకాల నిర్వహణ మార్గదర్శకాలు-2016, ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ మానిటరింగ్ గైడ్‌లైన్స్-2020లను గుత్తేదారు సంస్థ పూర్తిగా ఉల్లంఘించిందంది. గూగుల్ ఎర్త్‌లో 2021 నుంచి అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాలను విశ్లేషిస్తే విజయవాడ గనులశాఖ ఏడీ జారీ చేసిన లీజు ప్రాంతానికి బయట ఇసుక తవ్వుతున్నట్లు స్పష్టంగా కనిపించిందని ప్రస్తావించింది. రీచ్ ఒక చోట ఉంటే తవ్వకాలు దానికి ఎంతో దూరం వరకు జరిగాయని తేటతెల్లమైందని నివేదిక తెలిపిందంది. 2021 నుంచి జారీ చేసిన ఈసీల షరతులను జేపీ పవర్ వెంచర్స్ విస్మరించిందని గతేడాది ఏప్రిల్ నుంచి సియా కొత్త ఈసీలు జారీ చేయకపోయినా నవంబరు వరకు జేపీ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు కొనసాగించిందని ప్రస్తావించింది. డిసెంబరు నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జీసీకేసీ ప్రాజెక్ట్స్ సంస్థ భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతోందని దీనికీ ఎటువంటి అనుమతులు లేవని నివేదికలోని అంశాలను పేర్కొంది. ఈ నెల 19న కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ రీచ్‌లో ఎంవోఈఎఫ్ కమిటీ పరిశీలిస్తే అక్కడా జేసీబీలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ వాటి ఫొటోలతో సహా నివేదికలో స్పష్టంలో చేసిందని ఎన్జీటీ పేర్కొంది.
ఇసుకను ఊడ్చేస్తున్న వైసీపీ నేతలు- ఎన్జీటీ విచారణలో అధికారులకే చిక్కులు!
రాష్ట్రవ్యాప్తంగా సెమీ మెకనైజ్డ్ విధానంలో ఇసుక తవ్వకాలు ఆపేయాలంటూ జేపీ సంస్థకు, గనులశాఖ సంచాలకులకు 2023 ఏప్రిల్ 24న ఆదేశాలిచ్చామని, ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కొత్త ఈసీలు జారీ చేయలేదని సియా ఎన్జీటీకి స్పష్టం చేసింది. గత నెల 23, 24, ఈ నెల 7వ తేదీల్లో సమావేశాలు నిర్వహించి ఏడాది కాల వ్యవధితో 41 రీచ్‌ల్లో మాన్యువల్‌గా మాత్రమే ఇసుక తవ్వకాలకు వీలుగా గనుల శాఖకు అనుమతులు జారీచేసినట్లు పేర్కొంది. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదని స్పష్టంగా పేర్కొన్నట్లు సియా వివరించింది. మనుషులతో తవ్వకాలకే అనుమతించామని స్పష్టం చేసింది.
అన్ని అంశాలను పరిశీలించాక, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇసుక గుత్తేదారు ఎటువంటి ఈసీలు లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహించారని, నిబంధనలు ఉల్లంఘించారని ఎన్జీటీ స్పష్టం చేసింది. దీంతో గుత్తేదారు సంస్థ శిక్షార్హులు అని భారీ జరిమానా వేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే గుత్తేదారుకు జరిమానా విధించడంపై గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందున ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించడం సముచితమని అభిప్రాయపడింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నివేదికను తదుపరి విచారణలో సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఈలోపు మిగిలిన జిల్లాల్లో కూడా తనిఖీలు నిర్వహించి, ఆ నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఎంవోఈఎఫ్‌ను ఆదేశించింది. ఉల్లంఘనలపై పిటిషనర్లు గుర్తించిన అంశాలు సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు అవకాశం కల్పిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు ఎన్జీటీ ప్రకటించింది.
ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు - రీచ్‌ల నుంచి లారీలను బయటకు పంపిన టీడీపీ నేతలు
ఇసుక తవ్వకాలు జరగటం లేదని ఆయా జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికపై ఎన్జీటీ విస్మయం వ్యక్తం చేసింది. ఇంత విరుద్ధంగా ఎలా నివేదిక ఉంటుందని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ఏపీ ప్రభుత్వం తమ ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని కేంద్ర కమిటీ నివేదిక ద్వారా స్పష్టమైందని ఎన్జీటి అభిప్రాయపడింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టులో సైతం విచారణ జరుగుతున్నందున, తవ్వకాల విషయంపై సుప్రీం కోర్టే నిర్ణయం తీసుకుంటుందని ఎన్జీటి న్యాయమూర్తులు తెలిపారు. ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరిగే అవకాశముంది.