AP Liquor Sales :రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. వాటిలో డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో మద్యం ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత సర్కార్‌లో నాసిరకం లిక్కర్ అమ్మారని మందుబాబులు ఆరోపించారు. ఊరుపేరు లేని లిక్కర్ ముంచెత్తిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు లభిస్తుందని వారు హర్షం వ్యక్తం చేశారు.
New Liquor Shops Open in AP :కర్నూలులో కొత్తగా మద్యం దుకాణం ప్రారంభం కాగానే కొనుగోలుదారులు లిక్కర్ కోసం క్యూ కట్టారు. తమకు నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేసి మందుబాబులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో నాణ్యమైన లిక్కర్ కోసం దూరప్రాంతాలకు వెళ్లేవారమని చెప్పారు. ఆ క్రమంలో రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని పేర్కొన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని తెలిపారు. రాష్ట్రంలో మందు చాలా బాగుందని మందుబాబులు వెల్లడించారు. మరోవైపు కొన్నిచోట్ల లైసెన్స్‌దారులు షాపుల కోసం ప్రాంగణాలను వెతుకులాడే పనిలో ఉన్నారు.
మరోవైపు ప్రభుత్వ నిబంధనల మేరకు పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా మందిరాలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో వైన్ షాప్స్ ఏర్పాటు చేయాల్సిఉంది. నిబంధనల మేరకు చాలాచోట్ల దుకాణాలు దొరకడం లేదు. కొన్ని ప్రాంతాల్లో అద్దెలు ఎక్కువగా ఉండడంతో వెనుకంజవేస్తున్నారు. సిండికేట్‌తో సంబంధం లేకుండా సొంతంగా షాపులు దక్కించుకున్న వారు తమ లైసెన్సులను ఇతరులకు ఇచ్చేందుకు బేరసారాలు జరుపుతున్నారు. చాలా షాపులు చేతులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండేళ్ల పాటు లైసెన్స్ :మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు నిబంధనల ప్రకారం వార్షిక లైసెన్సు రుసుములో ఆరో వంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. దుకాణదారులు ఈ మొత్తాన్ని చెల్లించడంతో తాత్కాలిక లైసెన్స్ జారీ చేశారు. ఇది ఈనెల 22వ తేదీ వరకు అమలులో ఉంటుంది. షాపులను అద్దెకు తీసుకున్న తర్వాత రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉండే పూర్తి స్థాయి లైసెన్స్ ఇస్తారు. ప్రైవేట్ మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనుంది.
" జే " బ్రాండ్లకు చెల్లు- ఇక కోరుకున్న మందు- నాలుగు బ్రాండ్ల క్వార్టర్ ధర రూ. 99