ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అత్యంత కఠినంగా ఎన్‌డీపీఎస్‌ యాక్ట్ - గంజాయి కేసుల్లో చిక్కితే 20 ఏళ్లు కటకటాలే! - IMPACT OF NDPS ACT IN DRUGS CASES

డ్రగ్స్, గంజాయి విక్రయాలకు పాల్పడే నేరగాళ్లు కటాకటాల్లోకి - గతేడాది 25 కేసుల్లో 45 మందికి పదేళ్లకు పైగా జైలుశిక్ష

Impact of NDPS Act in Drugs Cases
Impact of NDPS Act in Drugs Cases (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2025, 12:48 PM IST

Impact of NDPS Act in Drugs Cases :అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వశపారి రాంప్రసాద్‌, వంతల రాజుబాబు 35 సంవత్సరాల లోపు యువకులు. కారులో 20 కిలోల గంజాయి తరలిస్తూ ఐదు సంవత్సరాల క్రితం కశింకోట వద్ద పోలీసులకు చిక్కారు. అనకాపల్లి జిల్లా న్యాయస్థానం వారిద్దరికీ 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది. దీంతో వారి జీవితం చీకటిమయమైపోయింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సవర గ్రామానికి చెందిన పి.శ్యాంసన్‌, సీహెచ్‌.గంగునాయుడు ఆరు సంవత్సరాల కిందట గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. న్యాయస్థానం జనవరిలో తీర్పు చెబుతూ వారిద్దరికీ 15 సంవత్సరాల జైలుశిక్ష, రూ.లక్ష చొప్పున జరిమానా విధించింది.

ఇలా ఒకరికో ఇద్దరికో కాదు 2024లో ఏపీలో 25 కేసుల్లో 45 మందికి పది సంవత్సరాలకు పైగా శిక్షలు పడ్డాయి. ఒక్కసారి ఈ కేసుల్లో చిక్కుకుంటే జీవితమంతా దుర్భరమే. ఏళ్లతరబడి జైల్లో మగ్గిపోవాల్సిందే. ఎన్‌డీపీసీ చట్టం (ది నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ యాక్ట్‌-1985) ప్రకారం శిక్షలు అత్యంత కఠినంగా ఉంటాయి. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల ఉత్పత్తి, విక్రయం, కొనుగోలు, రవాణా, వినియోగం, నిల్వ ఇవన్నీ నేరాలే.

Marijuana Cases in AP :ఇతర ఏ కేసుల్లోనైనా నిందితుడు నేరం చేశాడని పోలీసులు, ప్రాసిక్యూషన్‌ నిరూపించాలి. కానీ ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదైతే తాను ఆ నేరానికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఈ కేసుల్లో బెయిల్‌ రావడం చాలా కష్టం. తెలిసి కొందరు, తెలియక కొందరు ఈ విషవలయంలో చిక్కుకుని జీవితాల్ని నాశనం చేసుకున్నారు. వారి చీకటి అనుభవాలు చూసైనా పాఠాలు నేర్చుకుంటే మేలు. గంజాయి, డ్రగ్స్​ను అణచివేసే విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా ఉంది. ఐజీ ఆకే రవికృష్ణ ఆధ్వర్యంలో ఇప్పటికే ఈగల్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఫోర్స్‌ గంజాయి సాగు నుంచి రవాణా, వినియోగం వరకూ ప్రతి దశలోనూ నిఘా పెడుతోంది. వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటోంది.

20 సంవత్సరాల వరకూ జైలుశిక్ష - మరణశిక్షకూ వీలు :

  • కిలో లోపు గంజాయి పట్టుబడితే దాన్ని చిన్నమొత్తంగా, 20 కిలోలు అంతకంటే ఎక్కువ పట్టుబడితే దాన్ని వాణిజ్యపరంగా పరిగణిస్తారు.
  • 20 కిలోలు అంతకంటే ఎక్కువ గంజాయితో దొరికితే పది సంవత్సరాలకు తక్కువ కాకుండా, 20 ఏళ్ల వరకూ జైలుశిక్ష. రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. కిలో గంజాయితో పట్టుబడినా పదేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా పడుతుంది.
  • ఏవైనా రెండు, అంతకుమించిన కేసుల్లో దోషిగా తేలితే 30 సంవత్సరాల జైలుశిక్ష లేదా మరణశిక్ష విధించేందుకూ ఎన్‌డీపీఎస్‌ చట్టంలో అవకాశముంది.
  • డ్రగ్స్, గంజాయి సేవిస్తే సంవత్సరం జైలు
  • గంజాయి సహా మత్తు పదార్థాలు వినియోగించడం, సేవించడమూ నేరమే. వాటిని సేవిస్తూ పట్టుబడితే ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలుశిక్ష. రూ.10,000ల నుంచి రూ.20,000ల వరకూ జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

ఆస్తులూ జప్తే :మత్తు పదార్థాలు, గంజాయి అక్రమ వ్యాపారంతో స్మగ్లర్లు కూడబెట్టిన ఆస్తులనూ ఏపీ సర్కార్ జప్తు చేస్తోంది. తాజాగా విశాఖపట్నానికి చెందిన గంజాయి స్మగ్లర్‌ శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్‌ హుస్సేన్‌ అలియాస్‌ పుతీన్‌కు చెందిన రూ.2కోట్ల విలువైన భూములు, బంగారాన్ని జప్తు చేసింది.

ఇవన్నీ నేరాలే : గంజాయి, మత్తు పదార్థాల సాగు, ఉత్పత్తి, తయారీ, కలిగి ఉండడం, విక్రయం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగించడం, ఎగుమతి, దిగుమతి. అందుకు ప్రయత్నించడం. ప్రేరేపించడం. కుట్ర చేయడం.

నేరం- శిక్ష ఇలా :

  • తక్కువ పరిమాణం :సంవత్సరం వరకూ జైలుశిక్ష. రూ.10,00ల వరకూ జరిమానా
  • వాణిజ్య పరిమాణం : 10 నుంచి 20 సంవత్సరాల వరకూ జైలుశిక్ష. రూ.1-2 లక్షలు, అంతకంటే ఎక్కువ జరిమానా
  • తక్కువ పరిమాణం కంటే ఎక్కువ - వాణిజ్య పరిమాణం కంటే తక్కువ : 10 సంవత్సరాల వరకూ జైలుశిక్ష. రూ.లక్ష వరకూ జరిమానా
  • రెండు లేదా అంతకు మించిన కేసుల్లో దోషిగా తేలితే :మరణశిక్ష లేదా 30 ఏళ్ల జైలుశిక్ష
  • అక్రమ రవాణాకు ఆర్థికంగా సాయం అందిస్తే : 10 నుంచి 20 సంవత్సరాల వరకూ జైలుశిక్ష
  • అక్రమ ఉత్పత్తి, విక్రయం, ఎగుమతి, దిగుమతి చేస్తే : 10-20 ఏళ్ల వరకూ జైలుశిక్ష

ఆ పోర్టల్‌లోకి పేరు చేరితే - పాస్‌పోర్టులూ రావు :గంజాయి, మత్తు పదార్థాల కేసుల్లో ఒక్కసారి అరెస్టయితే చాలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆన్‌ అరెస్టెడ్‌ నార్కో-అఫెండర్స్‌ (నిదాన్‌) పోర్టల్‌లో పేరు నమోదైపోతుంది. వారికి పాస్‌పోర్ట్ జారీచేయరు. దాంతో విదేశీయానం ఆశలకు నీళ్లొదులుకోవాల్సిందే.

'మత్తు వీడు బ్రో' - డ్రగ్స్‌ నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు

పొట్లాలు కట్టి, సిగరెట్లుగా చుట్టి - రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు

ABOUT THE AUTHOR

...view details