NDA Leaders Fire On CM Jagan :రాష్ట్రానికి మేలు చేసే పోలవరం ప్రాజెక్టును రాజకీయ కారణాలతో పూర్తి చేయకపోవడం బాధాకరమని, రివర్స్ టెండర్లలతో సాగునీటి ప్రాజెక్టులను సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఎన్డీఏ కూటమి నేతలు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎడారిగా మారిందని దుయ్యబట్టారు. ఎన్నికల జిమ్మిక్కుల కోసం ఉత్తుత్తి ప్రారంభాలు చేస్తున్నాడని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా పోలవరాన్ని గోదాట్లో ముంచాడని, సాగునీటి ప్రాజెక్టులను ఎండగట్టాడని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బీజేపీ నాయకులు పాకా సత్యనారాయణ, జనసేన నాయకులు గౌతమ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
జగన్ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM
Irrigation Projects Situation in Andhra Pradesh :వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైందని ఎన్డీఏ కూటమి నేతలు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో 90 శాతం పూర్తైనా సాగునీటి ప్రాజెక్టులును కూడా పూర్తి చేయడం జగన్కు చేతకాలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలల్లో 68,293 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులకు కేవలం 39,052 కోట్ల రూపాయాలు మాత్రమే ఖర్చు పెట్టారని తెలిపారు.