NDA Leaders Election Campaign in State Wide : రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉండటంతో అభ్యర్థులు దూకుడు పెంచారు. కూటమి నేతలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అరాచకాలను ఎండగడుతూ జగన్ పాలనలో జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు. కూటమి ప్రకటింటిన మేనిఫెస్టోని అభ్యర్థులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అలాగే వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
జోరుగా సాగుతున్న కూటమి నేతల ప్రచారం - అడుగడుగునా జననీరాజనం - Lok Sabha elections 2024
తెలుగుదేశం జెండాలు చేతపట్టి విస్తృత ప్రచారం : విజయనగరం జిల్లా చీపురుపల్లి కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు గరివిడిలో నిర్వహించిన భారీ ర్యాలీకి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం జెండాలు చేతపట్టి పట్టణంలో తిరిగారు. తర్వాత రోడ్‌షోలో మాట్లాడిన కళా వెంకట్రావు గరివిడి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబి నాయనకు మద్దతుగా మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు ప్రచారం చేశారు. వార్డుల్లో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తర్వాత సుజయకృష్ణ ఇంటింటికి తిరిగి బేబినాయనకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి గెలుపుతోనే బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని భరోసానిచ్చారు.
జోరు వానలో సైతం తగ్గని అభిమానం :పాడేరులో కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. జోరు వానలో సైతం అభిమానులు, కార్యకర్తలు ర్యాలీ పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూ నృత్యాలు చేశారు. తెలుగుదేశం జెండాలతో పాడేరు వీధులు పసుపుమయమయ్యాయి. ఏలూరు జిల్లా చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్ జంగారెడ్డిగూడెంలో ప్రచారం చేశారు. స్థానికులు ఆయనకు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. తర్వాత రోడ్‌షో నిర్వహించిన సొంగా రోషన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి మాలకొండయ్యను గెలిపించాలని కోరుతూ హీరో నిఖిల్ రోడ్‌షో నిర్వహించారు. మాలకొండయ్యను గెలిపిస్తే చీరాల నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తారని నిఖిల్ అన్నారు.