NDA Government Will Introduce Full Budget Assembly Sessions from November 11 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ నెల 11న (నవంబర్ 11) ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంగా ఈ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆర్థిక మంత్రితో పాటు ఉన్నత అధికారులు రవిచంద్ర, పీయూష్ కుమార్, జానకి, నివాస్ తదితరులకు బడ్జెట్‌పై దిశానిర్దేశం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అధ్యయనానికే 4 నెలలకు పైగా సమయం పట్టింది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో అసలు ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో తెలుసుకునేందుకు ప్రభుత్వం మొదటగా ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రమూ వెలువరించింది. అప్పటికి కూడా రాష్ట్రంలో పూర్తి స్థాయి అప్పుల లెక్కలు, పెండింగు బిల్లుల లెక్కలు ఇంకా తేలలేదు. ఈ పరిస్థితుల వల్లే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వానికి ఇంత సమయం పట్టింది.
చివరి నాలుగు నెలలకే : సాధారణంగా ఏటా మార్చి లోపు బడ్జెట్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు. ఎన్నికల సంవత్సరం కావడంతో జగన్ ప్రభుత్వం ఫిబ్రవరి నెలలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను(Vote on account) సమర్పించింది. ఏప్రిల్ నుంచి జులై వరకు తొలి 4 నెలలకు రాష్ట్రంలో జీతాల చెల్లింపులు, ఇతర నిర్వహణ ఖర్చులు తదితరాలకు కలిపి 40 గ్రాంట్ల కింద రూ.1,09,052.34 కోట్లకు ఆమోదం తీసుకున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.2,86,389.27 కోట్లకు ఆమోదించి 4 నెలల ఖర్చుకు ఆమోదం పొందారు.
నవంబర్ 11న పూర్తి స్థాయి బడ్జెట్ - రూ. 2 లక్షల కోట్ల రాబడి సాధ్యమేనా?
మే లో సార్వత్రిక ఎన్నికలు జరిగి జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జులైలో కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పించాల్సి ఉన్నా ఆర్థిక పరిస్థితులపై అవగాహన, పూర్తి సమాచారం కోసం వాయిదా వేసింది. మరో 4 నెలల కాలానికి తాత్కాలికంగా ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను గవర్నర్ ద్వారా ఆర్డినెన్సు జారీ చేయించారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు నెలల్లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ఇతర నిర్వహణ ఖర్చులకూ కలిపి 1,29,972.97 కోట్ల రూపాయలకు కూటమి ప్రభుత్వం అనుమతి తీసుకుంది. ఇంతవరకు 8 నెలల కాలానికి రెండు ఓటాన్ ఎకౌంట్లు (Vote on account) కలిపి ప్రభుత్వం రూ.2,39,025.31 కోట్లకు అనుమతి తీసుకుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నా ఇక మిగిలింది 4 నెలల వ్యవధి మాత్రమే. ఈ వ్యవధిలో ఎంత ఖర్చు చేయగలరన్న అంచనాల మేరకు పూర్తి స్థాయి బడ్జెట్ రూపుదిద్దుకుంటోంది.
సంక్షేమానికి సముచిత స్థానం :కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాల అమలు ప్రారంభమయింది. సూపర్ సిక్స్ పథకాలకు (super six schemes) కేటాయింపులు ఈ ఆర్థిక సంవత్సరంలో(2024-25) ఎలా ఉండాలో సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేశారు. ప్రజలు అభివృద్ధినీ, సంక్షేమాన్ని కలిపి కోరుకుంటున్నారని తెలియజేశారు. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండు, మూడు నెలలకు ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2024-25) చివరి 4 నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది. అందుకు తగ్గట్టుగానే పథకాలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉండబోతున్నాయి.