ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

90 ఏళ్ల నాటి వంతెనపైనే రాకపోకలు - కూటమి ప్రభుత్వంపై ప్రజల ఆశలు - Narayanapuram Old Bridge Condition

Narayanapuram Old Bridge Condition: ఏలూరు జిల్లా నారాయణపురం వద్ద కొత్త వంతెన నిర్మాణానికి అడుగులు పడట్లేదు. ఇదిగో అదిగో అంటూ హడావుడితోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. శిథిలావస్థకు చేరిన వంతెనపైనే వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా వంతెనను పూర్తి చేస్తుందని స్థానికులు ఆశిస్తున్నారు.

Narayanapuram Old Bridge Condition
Narayanapuram Old Bridge Condition (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 9:07 AM IST

Updated : Jun 29, 2024, 9:13 AM IST

Narayanapuram Old Bridge Condition: కొల్లేరు ముఖద్వారంగా పిలిచే నారాయణపురంలో ఏలూరు ప్రధాన కాలువపై బ్రిటిష్‌ హయాంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. కొత్త వంతెనకు అడుగులు పడకపోవడంతో, 90 ఏళ్ల నాటి పూరాతన నిర్మాణమే రాకపోకలకు దిక్కైంది. వంతెనకు అటువైపున కొల్లేరుతోపాటు ఆక్వా సాగు అధికంగా ఉంటుంది. ఫలితంగా ఆక్వా ఉత్పత్తులు తరలించే భారీ లారీలతోపాటు వందలాది వాహనాలు నిత్యం ఈ వంతెనపై నుంచే వెళ్తుంటాయి. అలాంటి వంతెన స్లాబు కింది భాగంలో ఇనుప చువ్వలు బయటకు చొచ్చుకుని వచ్చాయి. గోడలు కూడా బీటలువారి ప్రమాదకరస్థితిలో ఉన్నాయి.

ఏళ్ల తరబడి నిర్వహణ లేకపోవడంతో వంతెన గోడలతో పాటు కింద వైపునా మొక్కలు మొలిచి చెట్లుగా మారాయి. వంతెనకు ఆధారమైన ఇనుప గడ్డర్లు తుప్పుపట్టి బలహీనంగా మారాయి. ఫలితంగా వంతెనపై భారీ వాహనాలు వెళ్లిన ప్రతిసారీ వారధి కదులుతోందని, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడంలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ రహదారి పక్కనే కావడంతో, ఏ చిన్న అవసరం వచ్చినా వాహనదారులు ఈ వంతెన దాటి ఇవతలికి రావాలి.

వర్షాకాలం వస్తోందంటేనే వణుకు- బుగ్గవంక రక్షణగోడకు మోక్షం ఎప్పుడో? - KADAPA BUGGAVANKA

మరోవైపు ఉదయం సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు నిడమర్రు మండలానికి తాగునీటిని సరఫరా చేసే పైపులైను ఈ వంతెన మీదుగా ఏర్పాటు చేయడంతో మరింత ఇరుకుగా మారి నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా పెరిగే రద్దీతో వంతెనకు రెండు వైపులా కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోతున్నాయని వాపోతున్నారు.

కొత్త వంతెన నిర్మాణానికి 2021లో 4 కోట్ల రూపాయలు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ క్రమంలో 2022 మే 16న గణపవరం వచ్చిన అప్పటి సీఎం జగన్ దృష్టికి వంతెన సమస్యను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వాసుబాబు తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్ మోహన్ రెడ్డి కొత్త వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరిలో 8 కోట్ల 50 కోట్లు మంజూరు కాగా, జనవరి 21, ఫిబ్రవరి 23న అధికారులు సర్వే నిర్వహించారు.

నెలలు గడిచినా పనులు కార్యరూపం దాల్చలేదు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగానే గుత్తేదారులు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఇక్కడ వంతెన నిర్మిస్తే ఉంగుటూరు మండలంతో పాటు నిడమర్రు, గణపవరం, భీమడోలు, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి, భీమవరం మండలాలు తూర్పు గోదావరి జిల్లాలోని దూబచర్లతో కలిపి సుమారు 156 గ్రామాల ప్రజల రాకపోకలకు ఉపయోగపడుతుంది.

ఉప్పుటేరుకు ఊరటేది- వైఎస్సార్సీపీ నిర్లక్ష్యానికి మత్స్యకారుల అవస్థలు! - Donkuru Bridge Damaged

Last Updated : Jun 29, 2024, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details