Chandrababu Naidu reacted on Drugs Case: విశాఖ తీరంలో 25 వేల కిలోల డ్రగ్స్‌ను సీబీఐ, కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స్పందించారు.ఈ డ్రగ్స్ రాకెట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.
ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏపికి ఎలా: వైఎస్సార్సీపీ మాఫియా వల్ల ఆంధ్రప్రదేశ్ దేశానికి డ్రగ్ రాజధాని గా మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ పోర్టులో 25000 కిలోల డ్రగ్స్‌ని సీబీఐ స్వాధీనం చేసుకోవటం షాక్ కి గురి చేసిందన్నారు. వచ్చే ఎన్నిక ల్లో వైఎస్సార్సీపీ ఈ డ్రగ్స్ ద్వారా ఏం చేయాలనుకుందని ప్రశ్నించారు. పోలీసులు, పోర్ట్ ఉద్యోగులు సహకరించకపోవడం అధికార పక్ష ప్రమేయం స్పష్టమవుతోందని ఆరోపించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ ఏపికి ఎలా చేరాయన్నది ప్రశ్నార్థకం గా మారిందన్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్‌గా మారిపోయిందని, యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడుతుందనే నా భయాన్ని తాజా ఘటన ధృవీకరిస్తోందని మండిపడ్డారు. ఈ విపత్తుకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
విశాఖలో 728 తుపాకులు స్వాధీనం- ఎన్నికల ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: సీపీ - Vizag CP Ravi Shankar
మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చివరకు మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ గంజాయి పట్టుబడ్డా మూలాలు మన రాష్ట్రంలోనే ఉండటం సిగ్గు అనిపించేది. ఈ అప్రదిష్టను మోస్తున్న తరుణంలో విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్ దొరికాయి అనే వార్త ఆందోళన కలిగిస్తుందన్నారు. భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకోవడం వెనక ఎవరు ఉన్నారో వెంటనే వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు.
గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినప్పుడు కూడా మూలాలు విజయవాడలోని ఆషి ట్రేడర్స్ పేరు మీద తేలాయి. ఆ సంస్థ వెనక ఉన్న పెద్దలు గురించి కూడా లోతుగా విచారించాలన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ సర్కార్ డ్రగ్స్ కి రాజధానిగా మార్చిందని గౌరవ ప్రధాన మంత్రి గారి సమక్షంలోనే బొప్పూడి బహిరంగ సభలో కొద్ది రోజుల కిందటే చెప్పానన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయి ఎంతగా ఉన్నాయో, సరఫరా ఏ స్థాయిలో ఉన్నాయో అందరూ అర్ధం చేసుకోవాలని పవన్ పేర్కొన్నారు. కేంద్ర నిఘా సంస్థలు డ్రగ్స్ రాకెట్ ను చేధించేందుకు చేపట్టిన ఆపరేషన్ గరుడను మరింత లోతుగా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలని, పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జగన్ ముఠా పాపాల పుట్ట ఒక్కొక్కటిగా బద్దలవుతోందనిటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఇక ఎలాగూ అధికారంలోకి రావడం అసాధ్యమని తేలిపోవడంతో ఆఖరి గడియల్లో వైఎస్సార్సీపీ చీకటి మాఫియాలు జాక్ పాట్ లు కొట్టే పనిలో నిమగ్నమయ్యాయని ఆరోపించారు. విశాఖ తీరంలో బ్రెజిల్ నుంచి తరలిస్తున్న 25వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయన్న వార్త తనను కలవరానికి గురిచేసిందన్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నాయంటే జె-గ్యాంగ్ ఎంత బరితెగిస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్ నూటికి నూరుపాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అని లోకేశ్ మండిపడ్డారు. ఆ కనుసన్నల్లోనే డ్రగ్స్, గంజాయి మాఫియాలు చెలరేగిపోతున్నాయని తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఆందోళన చేస్తూ వస్తోందని నారా లోకేశ్ గుర్తు చేశారు. ఈ చీకటి వ్యవహారాలను బయటపెట్టామన్న అక్కసుతోనే గతంలో వైఎస్సార్సీపీ మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా దాడికి తెగబడ్డాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖను రాజధాని చేయడం దేవుడెరుగు, డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చావు కదా జగన్ అని ప్రశ్నించారు.
విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టివేత- 25వేల కిలోలు స్వాధీనం చేసుకున్న సీబీఐ - CBI SEIZED 25 THOUSAND KGS DRUGS