Guntur Nandivelugu Flyover Incomplete in YSRCP Regime: అదేమీ పోలవరం ప్రాజెక్టు కాదు చిన్న ఫ్లైఓవర్. పట్టుపట్టి పనులు చేయిస్తే ఏడాదిలోపే పూర్తైపోతుంది. కానీ ఒకట్రెండు కాదు ఏడేళ్లుగా ప్రజలు ఆ ఫ్లైఓవర్ కోసం నిరీక్షిస్తున్నారు. 2019 ఎన్నికల నాటికే 25శాతం పూర్తైన పనుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం మధ్యలోనే వదిలేసింది. వైఎస్సార్సీపీ సర్కార్ జాప్యంతో నిర్మాణ వ్యయం ఇప్పుడు 30 శాతం పెరిగేలా కనిపిస్తోంది.
గుంతలు తేలిన సర్వీస్ రోడ్డు. వెక్కిరిస్తున్న సిమెంటు పిల్లర్లు. రైల్వే ట్రాక్‌పై గాలిలో తేలాడుతున్నట్లు కనిపిస్తున్న వంతెన. ఇదీ పాత గుంటూరు సమీపంలోని నందివెలుగు ఫ్లైఓవర్ దుస్థితి. గుంటూరు నుంచి నందివెలుగు వెళ్లే మార్గంలోని రైల్వే ట్రాక్‌పై ఫ్లైఓవర్ నిర్మించాలని రైల్వే, రాష్ట్ర రహదారుల భవనాల శాఖలు 2017లో నిర్ణయించాయి. రైల్వేశాఖ 3 కోట్ల రూపాయలతో తన పరిధిలోని పనులను 2021 నాటికే పూర్తి చేసింది. ఆర్అండ్బీ పరిధిలోని వంతెన నిర్మాణం మాత్రం ఇలా పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. 20 కోట్ల 2లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ పూర్తిచేసేలా ప్రభుత్వం గుత్తేదారుకు పనులు అప్పగించింది. 2019 ప్రారంభం నాటికే అంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే నాటికే 25 శాతం పనులు పూర్తయ్యాయి.
రహదారుల నిర్మాణానికి కేంద్ర సాయం మరింత కోరుదాం: డిప్యూటీ సీఎం పవన్ - Pawan Kalyan on Rural Roads
జగన్ అధికారంలోకి వచ్చాక బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు పనులు ఆపేశారు. 2022లో అక్టోబరులో కొంత బకాయిలు చెల్లించడంతో ఆరు నెలలపాటు నిర్మాణం సాగింది. 2023 మార్చి నాటికి 46 శాతం పనులు పూర్తిచేసిన గుత్తేదారు ప్రభుత్వానికి 5 కోట్ల 20 లక్షల రూపాయల మేర బిల్లులు పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గుత్తేదారు పనులను ఆపేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 2024 జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు పెండింగ్ బిల్లు మంజూరైంది. మళ్లీ పనులు చేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులు ఇస్తుందనే నమ్మకం లేక గుత్తేదారు మౌనంగా ఉండిపోయారు.