Nagarjuna Sagar Project Gates Open:నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా బేసిన్లోని అన్ని రిజర్వాయర్లు పూర్తిగా నిండి ఉన్నాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలేస్తున్నారు. దీంతో జూరాల, శ్రీశైలం నుంచి రోజు ఇన్ ఫ్లో పెరుగుతోంది. పైనుంచి వస్తున్న ప్రవాహాన్ని అంచనా వేసిన అధికారులు ఇవాళ జలాశయం 18 గేట్లు ఎత్తారు. ఈనెల 16న 4 గేట్లు ఎత్తిన అధికారులు తరువాత 12కి పెంచారు.
ఇవాళ నాగార్జున సాగర్ ప్రాజెక్టు 18 గేట్లు ఐదు అడుగులు మేర ఎత్తి స్పిల్వే ద్వారా లక్ష 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. ఎగువ నుండి లక్ష 90 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో వస్తోంది. సాగర్ జలాశయం మీద ఉన్న విద్యుత్ దీపాల కాంతులు క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు పడుతున్న నీటిపై పడడం వల్ల ఇంకా కొత్తగా కనిపిస్తుంది. ఔట్ ఫ్లో పోను మిగతా నీటితో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే పవర్ ప్లాంట్లోని రెండో టర్బైన్ యూనిట్లో 20 నెలలుగా విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. మొత్తం 8 యూనిట్లకు గాను ఏడు యూనిట్లే పనిచేస్తున్నాయి.
కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు : నాగార్జున సాగర్ జలాశయం రాత్రి పూట విద్యుత్ కాంతులతో సుందరంగా కనిపిస్తుంది. జలకళను సంతరించుకొని దిగువకు దిగుతున్న కృష్ణమ్మను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. రేపు ఆదివారం కావడంతో వచ్చే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. సాగర్ను చూసేందుకు తెలంగాణ టూరిజం వారి ప్యాకేజీ అందుబాటులో ఉంది.