Delay in Nadu Nedu Works at Kurnool District : రాష్ట్రంలో నాడు-నేడు పాఠశాలల ప్రగతిని మార్చుతోందని, రూ.కోట్లు వెచ్చించి బడుల రూపురేఖలు మార్చుతున్నట్లు ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇదిగో చూడండి అంటూ తరగతి గదులు పడగొట్టారు. నాడు-నేడు రెండో విడత పనులు 2022 జూన్‌లో ప్రారంభించారు. కర్నూలు జిల్లా పరిధిలో రెండో విడత కింద ప్రభుత్వ బడుల్లోని 1,074 పాఠశాలలను ఎంపిక చేశారు.
Nadu Nedu Works in AP : ఇందులో 457 బడుల్లో అదనపు తరగతి గదులు, 922 బడుల్లో మైనర్, మేజర్ పనులు, 367 విద్యాలయాల్లో ప్రహరీ పనులు చేపట్టాల్సి ఉంది. నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. నిధులివ్వక పోవడంతో ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఫలితంగా విద్యార్థులు చెట్ల కింద కూర్చొని పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. నాడు-నేడు పనులు ఏఏ స్థితిలో ఉన్నాయనే అంశాలపై నూతన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పూర్తిస్థాయిలో నివేదికలు కోరినట్లు తెలుస్తోంది.
రేకుల షెడ్డులో పాఠాలు : ఆదోనిలోని ఆర్‌ఆర్ లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాలలో 900 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు కింద రూ.1.95 కోట్లు వెచ్చించి 15 గదులు నిర్మించాలని ప్రణాళిక చేపట్టారు. ఎనిమిది గదుల నిర్మాణం 90 శాతం పూర్తి అయింది. నాలుగు గదులు స్లాబ్ దశలో ఉన్నాయి. మరో మూడింటి నిర్మాణాలు ప్రారంభించనేలేదు. నిధులు రాకపోవడంతో ఆ నిర్మాణాలు అంతటితోనే ఆగిపోయాయి. దీంతో విద్యార్థులను రేకుల షెడ్డులో కూర్చోబెడుతున్నారు.
చెట్ల కింద బాలికల చదువు : ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 3,150 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. నాడు-నేడు కింద రూ.2.40 కోట్లతో 20 అదనపు గదులు నిర్మించాలని అనుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది గదులకు పైకప్పు వేసి వదిలేశారు. నాలుగు గదులకు పునాదులు తవ్వి వదిలేశారు. మిగిలిన ఎనిమిది గదులకు పనులే ప్రారంభం కాలేదు. ఇప్పటి వరకు రూ.కోటికిపైగా ఖర్చు చేశారు. అదనపు గదులు పూర్తి కావాలంటే మరో రూ.కోటికిపైగా అవసరం. అన్ని తరగతులకు కలిపి 36 సెక్షన్లు ఉండగా 12 సెక్షన్లను చెట్ల కింద, వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు.
నిధులివ్వక - పనులు సాగక :పెద్దహోతూరులోని ఉన్నత పాఠశాలలో 502 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ నాలుగే గదులు ఉన్నాయి. నాడు-నేడు కింద రూ.2.80 కోట్లు వెచ్చించి 16 గదులు నిర్మించాలని నిర్ణయించారు. నిధులివ్వక పనులు ముందుకు సాగడం లేదు. అసంపూర్తి గదుల్లోనే విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.
ఆరు గదులు - 1,170 మంది : గుడేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,170 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 15 సెక్షన్లుగా విభజించి పాఠాలు భోదిస్తున్నారు. నాడు-నేడు కింద రూ.2.10 కోట్లతో 17 గదులు నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. శిథిలావస్థకు చేరిన గదులు పడగొట్టారు.. ఉన్న ఆరు గదుల్లో విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. నాడు-నేడు కింద ఎనిమిది గదుల నిర్మాణం కొనసాగుతోంది. బండ పరుపు, కిటికీలు, ప్లాస్టింగ్ పనులు చేయాల్సి ఉంది. అసంపూర్తి గదుల్లోనే నేలపైనే కూర్చొంటున్నారు. మరో మూడు తరగతుల విద్యార్థులను చెట్ల కింద కూర్చోబెడుతున్నారు.
పనులు |