Woman Kills Husband in Bapatla District During Domestic Dispute : తాగిన మైకంలో భర్త చేస్తున్న వికృత చర్యలు ఆ భార్యను హంతకురాలిగా మార్చేశాయి. అతడు పెట్టే వేధింపులు తాళలేని ఓ మహిళ భర్తనే మట్టు పెట్టింది. తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో తాళి కట్టిన భర్త ప్రాణాలు తీయాల్సిన పరిస్థితి వచ్చినా వెనకాడలేదు. బాపట్లలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసి తీవ్ర సంచలనం రేపింది.
బాపట్ల జిల్లా కొత్తపాలెం పంచాయతీ పెద్దూరుకు చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబు (38)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. భర్త వేధింపులు తాళలేక అరుణ పోలీసులను ఆశ్రయించింది. వారు అతన్ని మందలించి పంపించారు.
కన్నవారినే హతమార్చిన కర్కోటకులు
మంగళవారం అమరేంద్ర మద్యం మత్తులో జేబులో చాకు పెట్టుకుని భార్య వద్దకు వచ్చి గొడవ పడ్డాడు. తనను చంపేస్తాడన్న ఉద్దేశంతో అరుణ కర్రతో అతని తలపై బలంగా కొట్టింది. కిందపడ్డ అతడికి తాడు కట్టి నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చింది. మెడకు ఉరి బిగించి హత్యకు పాల్పడింది. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి గురువారం సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. నిందితురాలు అరుణ పరారీలో ఉందని పోలీసులు తెలిపారు.