Amaravati Connected with Highways :రాజధాని అమరావతి ట్రంక్ రోడ్లను 16వ నంబర్ జాతీయ రహదారితో మూడు చోట్ల అనుసంధానించేలా నిర్మాణాలు చేస్తున్నట్టు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణంతో పాటు రోడ్ల అనుసంధానంపై మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో ఈ -11, ఈ -13 రోడ్లు నిర్మించే ప్రాంతాలు, పశ్చిమ బైపాస్ నిర్మాణ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు.
వెంకట పాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను మంత్రి పరిశీలించారు. రాజధాని పరిధిలోని రహదారులను అనుసంధానించేందుకు ఇప్పటికే లీ కన్సెల్టెన్సీకి అధ్యయనం చేయాల్సిందిగా సూచించామని మంత్రి వివరించారు. 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు నుంచి పశ్చిమానికి 16 రోడ్లు, ఉత్తరం నుంచి దక్షిణానికి 18 ప్రధాన రహదారులు వస్తున్నాయని మంత్రి వివరించారు.
సీడ్ కేపిటల్ నుంచి E11, E13, E15 ట్రంక్ రోడ్లను జాతీయ రహదారికి కలిపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ రహదారుల నిర్మాణానికి ఎక్కువగా ఉన్న అటవీ భూములనే తీసుకుంటున్నామని ఈ రోడ్ల నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారు సహకరించాల్సిందిగా మంత్రి అభ్యర్థించారు. స్థానికులకు ఎక్కువ నష్టం లేకుండా చూస్తున్నామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
"అమరావతి రాజధాని"లో ఆ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటు - ఫిక్స్ చేసిన CRDA