Rains in Andhra Pradesh: ఉక్కపోత, వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈనెల 19వ తేదీకల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది.
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు:దక్షిణ కర్ణాటక నుంచి వాయవ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశా తెలిపింది.