MLC Kavitha CBI Custody :దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈడీ కస్టడీ నుంచి సీబీఐ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటికే ఆమెను అరెస్టు చేసినట్లు ప్రకటించిన సీబీఐ, లోతుగా విచారించేందుకు 5 రోజులు కస్టడీ కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో భాగంగా కవిత (Kavitha Liquor Case)ను ఇవాళ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ హాజరుపరిచింది. అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించేందుకు 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.
కోర్టులో సీబీఐ వాదనలు :కోర్టులో వాదనలు వినిపించిన సీబీఐ తరఫు న్యాయవాది మద్యం కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారి అని తెలిపారు. విజయ్ నాయర్, తదితరులతో కలిసి పథకం రూపొందించారని అన్నారు. అందుకు దిల్లీ, హైదరాబాద్లో సమావేశాలు జరిగాయని చెప్పారు. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఆమె పాత్ర స్పష్టంగా ఉందని చెప్పారు. రూ.100 కోట్లు సౌత్ గ్రూప్ నుంచి సమీకరించి ఆప్ నేతలకు అందించారని వివరించారు. కవిత సూచనతో మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ.25 కోట్లు అందజేశారని ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డి తన వాంగ్మూలంలో వెల్లడించారని స్పష్టం చేశారు.
సీబీఐ ప్రశ్నించడంపై కవిత పిటిషన్ - తదుపరి విచారణ ఈ నెల 26కు వాయిదా - MLC Kavitha CBI Investigation
Delhi Liquor Scam Case Update :అందుకు వాట్సాప్ చాట్ (Kavitha Whatsapp Chats) సంభాషణలు ఈ విషయాలు ధ్రువీకరించాయని సీబీఐ న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. సంభాషణలను కోర్టుకు అందజేసినట్లు చెప్పారు. మద్యం కేసులో కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ఇచ్చారని, అభిషేక్ సూచనతో ఆప్ నేతలకు డబ్బు ఇచ్చినట్లు అశోక్ తెలిపాడని కోర్టుకు తెలియజేశారు. అలాగే కవితకు ఇండో స్పిరిట్స్లో 33 శాతం వాటా ఉన్నట్లు బుచ్చిబాబు చెప్పారని కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ విషయాలన్నీ ఇప్పటికే ఛార్జిషీట్లో సీబీఐ దాఖలు చేసింది. తగిన ఆధారాలు కూడా అందుకు జతపరిచినట్లు సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.