BRS MLA Lasya Nanditha Died Car Accident :కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. అంతకుముందు ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయి. అయినా అందులో నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తొలిసారి ఆమె లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. ఆ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడగా, మూడో ప్రమాదంలో నేడు ప్రాణాలు కోల్పోయారు.
Cantonment MLA Lasya Nanditha Passed Away :గత సంవత్సరం డిసెంబర్ 24న సికింద్రాబాద్ న్యూ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లాస్య నందిత లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఆసుపత్రిలోని మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. ఓవర్‌లోడ్ కారణంగా లిఫ్ట్ కిందకి వెళ్లిపోవడంతో లాస్య నందిత అందులో ఇరుక్కుపోయారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు అందులో చిక్కుకున్న వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
BRS MLA Lasya Nanditha Car Accident :ఈ నెల ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో లాస్య నందిత (MLA Lasya Nanditha) పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే తలకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందని మరొకరు గాయపడ్డారు.
కారులో ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అదే కారులో ఆమె సోదరి నివేదిత, ఇద్దరు గన్మెన్లు ఉన్నారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న లాస్య నందిత తన సోదరితో కలిసి మరో కారులో హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఘటన జరిగిన పది రోజుల్లోనే నేడు కారు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు పటాన్‌చెరు ఓఆర్‌ఆర్ వద్ద ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె పీఏ, డ్రైవర్ అయిన ఆకాశ్ తీవ్రంగా గాయపడగా అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
1987 - 2024 : దివంగత నేత సాయన్న కుమార్తె లాస్య నందిత. 1987లో హైదరాబాద్‌లో ఆమె జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. 2015లో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత, 2015 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్‌లో చేరారు. 2016-2020 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
గతేడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రిసాయన్న (MLA Sayanna) మృతి చెందారు. అనంతరం 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో లాస్య నందిత కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి గణేశ్‌పై 17,000ల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఇంతలోనే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీకుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే ఆమె కుడా తండ్రి వద్దకు వెళ్లారని కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.