MLA Komatireddy Rajagopal Reddy Comments on BRS : గత ప్రభుత్వం దోపిడీ కోసం, కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మొన్న మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) సందర్శన ద్వారా ప్రజలకు చాలా నిజాలు తెలిశాయని అన్నారు. గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే ప్రాణహిత-చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం చేపట్టారని తెలిపారు. శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు.
పేరు కోసమో, డబ్బు కోసమో గానీ కేసీఆర్ భారీ నిర్మాణాలు చేపట్టారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) పేర్కొన్నారు. పేరు కోసం భారీగా ఖర్చు పెట్టి సచివాలయం, యాదాద్రి నిర్మాణాలు చేశారన్నారు. గత సీఎం ముందు మాట్లాడే అధికారం మంత్రులకు కూడా ఉండలేదన్నారు. నల్గొండ జిల్లాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇంకెవరూ చేయలేదని చెప్పారు. మాజీ సీఎం కుర్చీ వేసుకొని కూర్చొని నల్గొండ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నారని గుర్తు చేశారు.
MLA Komatireddy Fires on KCR :గత ప్రభుత్వం80 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. మిగతా 20 శాతం పనులు పూర్తి చేసి ఉంటే లక్ష ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. డిండి ఎత్తిపోతల పథకం(Dindi Lift Irrigation Project) కింద చేపట్టిన ప్రాజెక్టులను పట్టించుకోలేదని దీంతో మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలు తీవ్రమైన కరవు ప్రాంతాలుగా మారాయన్నారు. ఈ ప్రభుత్వం మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని ప్రాజెక్టును పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కలంకం - పదేళ్లలో రాష్ట్రాన్ని దివాలా తీయించారు : సీఎం రేవంత్‌రెడ్డి