Minor Groom Major Bride Marriage in AP : వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని ఇప్పుడు వివాహం కూడా చేసుకున్నారు. ఇందులో ఆశ్చర్యం ఏముందిలే అనుకుంటున్నారా? ఈ ప్రేమ కహానీలో అమ్మాయి మేజర్, అబ్బాయి మైనర్ కావడమే ఇక్కడ స్పెషల్. ఆ ఏముందిలే ఇలాంటి వివాహాలు జరుగుతుంటాలే అనుకుంటారా? వారిద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెెళ్లారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఆ ఇద్దరి ప్రేమ పెళ్లిపై పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు? చివరికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఇదీ జరిగింది :కృష్ణా జిల్లా పెడన మండలం నందిగామకు చెందిన ఇరువురు ప్రేమికులు వివాహం చేసుకుని గురువారం పెడన పోలీస్ ఠాణాకు వచ్చారు. వారిద్దరిలో వరుడు మైనర్ కాగా వధువు మేజర్ కావడం గమనార్హం. పెళ్లికుమార్తెకు 18 ఏళ్లు నిండగా వరుడికి 19 సంవత్సరాల వయస్సు. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా, అబ్బాయి ఇంటర్ వరకు చదివి ఆపేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువురి పెద్దల్ని పిలిపించి చర్చించారు. వివాహానికి సంబంధించి 21 సంవత్సరాలు దాటే వరకు యువకుల్ని మైనర్‌గా పరిగణించాలని చట్టం చెబుతోందని ఎస్సై జి.సత్యనారాయణ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలా? లేదా, ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలా అన్న విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు.