Ministers Inspected Yadadri Thermal Plant : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈ పవర్ ప్రాజెక్టు జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం విద్యుత్ కేంద్రం పనుల పురోగతిని పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ముందుగా హెలికాప్టర్లో దామరచర్ల మండలం వీర్లపాలెం చేరుకున్న నేతలు, ఆ ప్రాంతంలో నిర్మిస్తున్న యాదాద్రి సూపర్ క్రిటికల్ అల్ట్రా థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సందర్శించారు.
గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను, పద్ధతులను మార్చుకుని త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యాదాద్రి పవర్ ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ పవర్, రెనేవబుల్ ఎనర్జీ వైపు వెళుతుంటే గత పాలకులు మాత్రం థర్మల్ పవర్ వైపు దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ త్వరగా పూర్తి చేయకపోతే సంస్థకు చెడ్డ పేరు వస్తోందని హితవు పలికారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం హెచ్చరించారు.
తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్