Ministers Distributed Pensions by Going Door to Door in AP:కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగురాలు సీమా ఫర్వీన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్ అందజేశారు. వందశాతం అంగవైకల్యం ఉన్నా వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందని ఆమెకు పింఛన్ నిలిపివేసింది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును సీమా ఫర్వీన్ కలవగా అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడమేగాక అప్పట్లో సీమా ఫర్వీన్‌తో చంద్రబాబు సెల్ఫీ దిగారు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తొలి పింఛన్ 15 వేల రూపాయలను మంత్రి కొల్లు రవీంద్ర ఆమె కుటుంబానికి అందజేశారు.
పెనమలూరులో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పింఛన్‌దారులతోపాటు ఇంట్లో కిందే కూర్చుని వారికి నగదు అందజేశారు. అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేపట్టారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు నగదు అందజేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అడివిపాలెంలో వృద్ధులు, వితంతువులకు మంత్రి రామానాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. జీవిత చరమాంకంలో ఉన్న పెద్దలకు ఎంత సాయం చేసినా తక్కువేనంటూ లబ్ధిదారుల కాళ్లను మంత్రి కడిగారు. నూజివీడులో సామాజిక పింఛన్లను మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పింఛన్ పంపిణీ చేయగా, కొత్తూరులో ఓ దివ్యాంగురాలు తనకు ఇచ్చిన 6 వేలలో సగం అమరావతికి విరాళంగా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా గోపారంలో మంత్రి కందుల దుర్గేశ్ లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.
ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్ - Pawan Kalyan meeting in Gollaprolu