Crop Loss Assessment Details : రాష్ట్రంలో అకాల వర్షాలు రైతుల నడ్డీ విరుస్తున్నాయి. మొన్నటివరకు తగినంత నీరు లేక పంటలు ఎండిపోవడంతో నష్టపోయిన రైతు, తాజాగా పండిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో నష్టపోతున్నాడు. ఈనేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం పంటనష్టంపై దృష్టి సారించింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు దెబ్బతిన్న పంట వివరాలను సేకరిస్తున్నారు.
ప్రకృతి కన్నెర్రకు పెట్టుబడి వర్షార్పణం - అకాల వర్షాలతో అన్నదాత అతలాకుతలం - crop damage in telangana
తాజాగా కురిసిన అకాల వర్షం, వడగండ్ల వానలతో దెబ్బతిన్న పంటనష్టం వివరాల సేకరణలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు అధికారులు పంట నష్టం వివరాల సేకరణకు ఉపక్రమించారు. ఇప్పటికే పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా, నిన్న కురిసిన అకాల వర్షాలకు ఇంకొక 920 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు అధికారులు మంత్రితో పేర్కొన్నారు.
రంగారెడ్డి, జనగామ, నిర్మల్ జిల్లాలలో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు, అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలకు పంట నష్ట పరిహారం విడుదల చేసేందుకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం కోసంకు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే. దానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా, ఎన్నికల సంఘాన్ని మరొసారి సంప్రదించి నిధుల విడుదలకు అనుమతులు పొందేలా విజ్ఞప్తి చేయమని సూచించింది.