Minister Satya Kumar Letter to YS Jagan:వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్కు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరు పేజీల బహిరంగ లేఖను సంధించారు. రాష్ట్రంలోని ప్రజారోగ్యంపై నిరంతరం జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆ లేఖలో ఆక్షేపించారు. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఐదేళ్ల పాలనలో ఘన విజయాలు సాధించినట్టు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు సందేశాన్ని ఇంకా జగన్ అర్ధం చేసుకున్నట్టు కనిపించడం లేదని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. ఇంగితజ్ఞానం లేకుండా ప్రజలెందుకు తిరస్కరించారో ఆలోచించటం మానేసి, జగన్ ఎదురు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి తీవ్రంగా ఆక్షేపించారు. ఆరోగ్యశ్రీలో బకాయిలు పెట్టి వెళ్లిపోయి అసత్యాలు ప్రచారం చేయటంపై సిగ్గుగా లేదా అంటూ జగన్ను మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు. బీమా ద్వారా నగదు రహిత వైద్య సేవలు ఇవ్వాలని భావిస్తుంటే, ప్రైవేటు పరం అనటం జగన్ రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.
జగన్ హయాంలో ఒక్క కుటుంబానికైనా ఉచిత వైద్య చికిత్సల్లో భాగంగా రూ.25 లక్షలు చెల్లించారా అంటూ మంత్రి ప్రశ్నించారు. 108, 104 సేవలు అధ్వానంగా నిర్వహించిన జగన్ వాటి గురించి మాట్లాడటం విడ్డూరమని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు. నాడు నేడూ అంటూ ప్రభుత్వాసుపత్రుల్లో ఏం మార్పులు తెచ్చారంటూ ఆరు పేజీల లేఖలో మంత్రి ప్రశ్నించారు. 17 కొత్త మెడికల్ కాలేజీలని చెప్పి హంగామా చేసి కుర్చీ దిగిపోతూ కనీసం ఒక్క కాలేజీని కూడా నిర్మించలేదని మంత్రి ఆక్షేపించారు. అసత్యపు పునాదులపై రాజకీయ సౌధాన్ని నిర్మించుకోవటం మానేసి విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్కు మంత్రి సత్యకుమార్ హితవు పలికారు.