Minister Ponguleti slams KCR : గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలంతా ఫామ్‌హౌజ్‌లు కట్టుకుని పేదలకు ఇంటి సౌకర్యాలను విస్మరిస్తే, ఇప్పుడు వారందరికీ నివాస వసతిని కల్పిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల మేలు కోరే ప్రభుత్వమని, అందుకే ఇందిరమ్మ రాజ్యం అని గర్వంగా చెప్పుకుంటున్నామని మంత్రి తెలిపారు. తక్షణమే చింతమడకలో పర్యటించి ఇండ్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇల్లు పాయే, గుడిసె పాయే : ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఇళ్లు లేకుండా ఇబ్బంది పడకూడదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఎలాంటి భేషజాలకు పోకుండా వీలైనంత త్వరగా చింతమడకలో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చింతమడకలో పేదల కష్టాలపై స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ నిర్వాకం వల్ల ఇల్లు పీకి పందిరి వేసిన చందంగా ఉందని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఉన్న ఇల్లు పాయె, గుడిసె పాయె విధంగా ఉందని విమర్శించారు.
ఊరోళ్లకే పంగ నామాలు : తన పుట్టినిల్లు అయిన చింతమడక గ్రామంలో సీఎం హోదాలో ఐదేళ్ల క్రితం డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని పేదోళ్ల ఇండ్లన్నీ కూల్చివేసి ఇప్పటివరకు వారికి నిలువ నీడ లేకుండా చేశారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి దశ దిశ చూపిస్తా అని ప్రగల్పాలు పలికిన కేసీఆర్, ఊరోళ్లకే పంగ నామాలు పెట్టారని విమర్శించారు. చింతమడకలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తానని 22 జులై 2019లో ఆర్భాటంగా కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు.