MINISTER PAYYAVULA KESHAV ON BOTSA: బడ్జెట్లో కేటాయింపులను నిరసిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేయడంపై శాసన మండలిలో విపక్ష నేత బొత్స ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తిప్పి కొట్టారు. సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించినా వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 6484.75 కోట్ల కేటాయింపులు చేశామన్న మంత్రి, బీసీ, ఈబీసీ, సోషల్, ట్రైబర్, మైనార్డీ, క్రిష్టియన్ వెల్ఫేర్ కింద కేటాయింపులు చేశామన్నారు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల సొమ్ము 4 వేలకు పెంపు, అన్నా క్యాంటీన్లు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు 1450 కోట్లు, మున్సిపాల్టీలకు 300 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన 1670 కోట్లు ధాన్యం బకాయిలను చెల్లించినట్లు మంత్రి తెలిపారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు చెల్లింపులు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిన 1200 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున సాయం: గత ప్రభుత్వం 15వ తేదీ వరకు వేతనాలివ్వగా, తాము 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషిచేస్తున్నారన్న మంత్రి, కేంద్రప్రభుత్వం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున సాయం అందుతోందన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3సెంట్లు స్థలం ఇచ్చేందుకు నిధులు కేటాయించామని, సూపర్ సిక్స్ పథకాలను ఒకదాని తర్వాత మరొకటి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్ధిక విధ్వంసం, అరాచకత్వం జరిగిందన్న పయ్యావుల కేశవ్, అకౌంట్లను, రాష్ట్ర ఆర్థిక పరిస్ధితిని కాగ్‌కు కూడా గత ప్రభుత్వం చూపలేదన్నారు. గత 5 ఏళ్లు నుంచి పేరుకుపోయిన బకాయిలే లక్ష 35 వేల కోట్లు ఉన్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి అత్యంత దయనీయంగా తయారైనా నిధులను సమకూర్చుతున్నట్లు తెలిపారు.
గడిచిన ఐదేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు 20.8 శాతం పెరిగాయి: అనిత