Nara Lokesh on Yuvagalam Padayatra:యువగళం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2,097 గ్రామాలు మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ. సాగిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర మొదలై నేటికి రెండేళ్లని ఆయన గుర్తు చేశారు.
నాటి పాలకులు పాదయాత్ర ఆపడానికి చెయ్యని ప్రయత్నం లేదని మైక్ వెహికల్ సీజ్ చెయ్యడం దగ్గర నుంచి వాలంటీర్లును అరెస్టు చేయడం వరకూ అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని అన్నారు. నాటి పాలకులు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలు చూపించిన ప్రేమ తనను మరింత దృఢంగా మార్చిందన్నారు. పాదయాత్ర ప్రతీ అడుగులో ప్రజల కష్టాలు చూసానని ఆ రోజు చూసిన కన్నీటి గాథలు నేటికీ తనకు గుర్తున్నాయని అన్నారు. యువగళం పాదయాత్రలో ప్రత్యక్షంగా- పరోక్షంగా భాగమైన ప్రతి ఒక్కరికీ, తనను ఆదరించిన ప్రజలకు లోకేశ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన నేతలు: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమై రెండేళ్లు పూర్తైన సందర్భంగా మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, నారాయణ, కొల్లు రవీంద్ర, డోలా బాల వీరాంజనేయ స్వామి, పయ్యావుల కేశవ్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే బోడె ప్రసాద్, శాసనసభ, మండలి ఛీఫ్ విప్లు జీవి ఆంజనేయులు, పంచుమర్తి అనురాధలు శుభాకాంక్షలు తెలిపారు. అప్పటి వైఎస్సార్సీపీ నిర్బంధాలకు వ్యతిరేకంగా చేసిన యువగళం పాదయాత్రకు రెండేళ్లు అయ్యిందని గుర్తుచేశారు. ఆఖరుకు ఎత్తైన పీట వేసుకుని ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేసినా జగన్ ప్రభుత్వం వేధించిందని మండిపడ్డారు.