Lokesh meets Wipro and Temasek Representatives: దావోస్‌లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని ఏఐ(AI) హబ్‌గా మార్చాలనుకుంటున్నట్లు వివరించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లతోపాటు కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో, టెమాసెక్ సహా వివిధ సంస్థల ప్రతినిధులను కోరారు.
వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం:దావోస్‌లో మూడో రోజు పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేశ్ సమావేశం అయ్యారు. రాత్రి బసచేసిన హోటల్ నుంచి ఏపీ పెవిలియన్‌కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జాం కావడంతో సమాయానికి సమావేశాలకు హాజరయ్యేందుకు కొంతదూరం కాలినడకన వెళ్లారు. టెమాసెక్ హోల్డింగ్స్ భారత స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ హెడ్ రవి లాంబాతో లోకేశ్ భేటీ అయ్యారు. వైజాగ్, తిరుపతిలో టెమాసెక్ టెలీమీడియా ద్వారా డేటా సెంటర్లు, డేటా సెంటర్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరిన లోకేశ్ అనుబంధ సంస్థ క్యాపిటా ల్యాండ్ ద్వారా కమర్షియల్ స్పేస్, పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
దావోస్‌లో బిజీబిజీగా మంత్రి లోకేశ్ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
టెమాసెక్ మరో అనుబంధ సంస్థ సెంబ్ కార్ఫ్‌తో కలసి పవర్ ట్రాన్స్ మిషన్‌ను బలోపేతం చేయడం, గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపర్చడం వంటి కార్యకలాపాలు చేపట్టాలన్నారు. 2028 నాటికి క్యాపిటా ల్యాండ్ ద్వారా భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులను రెట్టింపు చేయాలనుకుంటున్నామన్న రవిలాంబా ఏపీలో పెట్టుబడులపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
బోర్డు సభ్యులతో చర్చించి నిర్ణయం: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ కార్యకలాపాలు ప్రారంభించాలని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీని మంత్రి నారా లోకేశ్ కోరారు. విప్రో అవసరాలు, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా విశాఖ, విజయవాడ, తిరుపతిలో కార్యకలాపాలు ప్రారంభించాలని అభ్యర్థించారు. AI, క్వాంటమ్ కంప్యూటింగ్, పునరుత్పాదక శక్తిలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు విప్రో సహకరించాలన్నారు. వైజాగ్, విజయవాడలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలు, పరిశోధనా హబ్‌ల ఏర్పాటును పరిశీలించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, బ్లాక్ చైన్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో విప్రో పెట్టుబడులు పెడుతోందన్న రిషద్ ప్రేమ్‌జీ బోర్డు సభ్యులతో చర్చించి ఏపీలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.