Flood Relief Operations in AP :ఏపీలో వరద సహాయక చర్యలపై వివిధ శాఖల మంత్రులు, అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమన్వయం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆయన పర్యవేక్షణలో విజయవాడ బాధితులకు ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బాధితుల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ సంస్థలు ఆహారాన్ని పంపిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు. సోమవారంతో పోల్చితే ఈరోజు ఉదయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద 2 లక్షల క్యూసెక్కుల పైగా వరద తగ్గుముఖం పట్టిందని వివరించారు.
Vijayawada Floods 2024 :బాధితుల కోసం ఐదు హెలికాప్టర్లు, 174 బోట్లు, డ్రోన్లు పనిచేస్తున్నాయని లోకేశ్ తెలిపారు. వాటి ద్వారా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారికి ఆహార పదార్థాల సరఫరా చేస్తున్నారని చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో 2,000ల కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 25 చోట్ల రహదారులకు కోతలు ఏర్పాడ్డాయన్నారు. అదేవిధంగా 1,80,244 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. మరోవైపు 43,417 మంది నిరాశ్రయులు అయ్యారని పేర్కొన్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించి కావల్సిన సౌకర్యాలను అందిస్తున్నట్లు లోకేశ్ వివరించారు.