Minister Komatireddy Comments On Telugu Film Industry : తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా పేరుతో సినిమాలు నిర్మించామని, టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరే నిర్మాతలకు ఇకపై సమయం ఇచ్చేది లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమ అంటే ఐదారుగురు పెద్దలు, ఐదారుగురు హీరోలదే కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో సినిమా పట్ల ఆసక్తి ఉన్న అందరిదని వ్యాఖ్యానించారు.
‘చిత్రపురి’లో తెలంగాణ వారికే ప్రాధాన్యత : హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి, రాష్ట్రంలో చిత్ర పరిశ్రమను బాగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఆరోసారి ఛైర్మన్‌గా ఎన్నికైన రామకృష్ణ గౌడ్‌కి అభినందనలు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా ఆయన ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. అయితే ఒకే కుటుంబం నుంచి ఐదారుగురు హీరోలు ఎదుగుతున్నారని, నిజమైన తెలంగాణ ప్రతిభ కలిగిన నటీనటులకు గుర్తింపు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.