Minister Komatireddy Inspected Uppal Elevated Corridor Works : ఉప్పల్- నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, అధికారులతో కలిసి పరిశీలించారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతల మయంగా మారి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు.
ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆరేళ్లలో 6 కిలోమీటర్ల ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయలేదంటే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. నారపల్లి నుంచి ఉప్పల్ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతోనేనని, వంతెన నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మంత్రి మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy On Uppal Flyover :ఈ చర్చలో పాల్గొనేందుకు మీరు అర్హులు కారని అధికారులపై కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించారు. గుత్తేదారుపై పూర్తి నెపం నెట్టడం కాదన్న ఆయన, మీరు చేయాల్సిన పనిని మీరు సక్రమంగా చేయలేక పోయారన్నారు.
జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్, కాంట్రాక్టర్ అంటూ సాకులు చెప్పొద్దని మండిపడ్డారు. ఈనెల 8వ తేదీ నుంచి కన్స్ట్రక్షన్ వర్క్స్ తిరిగి ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో తెలిపారు. సెప్టెంబరు చివరి కల్లా ఎలివేటెడ్ కారిడార్ టెండర్ పనులు పూర్తి చేయాలని, పనులు ప్రారంభించిన రెండున్నరేళ్లలోగా పై వంతెన పనులు పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆఫీసర్లు అధిక సమయం ఫ్లైఓవర్ పనులకే కేటాయించాలని సూచించారు.