Minister Botsa Comments on Land Titling Act: ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే జిల్లా జడ్జి స్థాయి అధికారి దృష్టికి తీసుకెళ్లొచ్చని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వారి ఉత్తర్వులపైనా అభ్యంతరాలుంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే అని బొత్స సత్యనారాయణ అంగీకరించారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తామన్నారు. అమరావతిలో ఉన్న హైకోర్టుకు వెళ్లడానికి సామాన్య ప్రజలకు ఇబ్బంది కాదా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు హైకోర్టుకు ఎవరు వెళ్లమన్నారు. మేం వెళ్లమని చెప్పామా అంటూ బొత్స అసహనం వ్యక్తం చేశారు.
ఆంధ్రులారా తస్మాత్ జాగ్రత్త - ఇది జగన్ మార్కు దోపిడీ చట్టం - చూసుకోకుంటే మీ భూములు ఇక అంతే!
జిల్లా జడ్జి స్థాయి అధికారి ఉత్తర్వులతో రూలింగ్ ఇచ్చిన తర్వాత హైకోర్టుకు తప్ప కింది కోర్టుకు వెళ్లడానికి అవకాశం లేదన్నారు. కింది కోర్టుల పరిధి తీసేశాం. ఈ విషయమై న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో పరిశీలిస్తామని చెప్పామన్నారు. గిట్టని వ్యక్తులు చేసిన క్లెయిమ్‌ల వల్ల స్థలం డిస్ప్యూట్ రిజిస్ట్రర్‌లో చేరితే సామాన్య ప్రజలు హైకోర్టు చుట్టూ తిరగలేరుగా అని ప్రశ్నించగా మీరు చెప్పింది నిజమేనంటూ అంగీకరించారు. ఆ వెంటనే అలా తిరగకుండా ఉండటానికే చట్టం తీసుకొస్తున్నామని బదులిచ్చారు. ఈ చట్టం గురించి ఏమైనా సందేహాలుంటే అడగండి సమాధానాలు చెబుతా అంటూనే మంత్రి పాత్రికేయులకు ఎదురు ప్రశ్నలు వేశారు. పైగా పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో వేస్తే తప్పేంటంటూ సమర్థించుకున్నారు.