Mining Authorities Calculating Gravel Mining in Krishna District: కొండలు కొల్లగొట్టి, పోలవరం కాలువ కట్టలు కరిగించేసి, అటవీ, అసైన్డ్ భూముల్ని గుల్లచేశారు. ఆఖరికి చెరువులనూ ఛిద్రం చేశారు. అదేమని అడిగితే జగనన్న కాలనీల కోసమని ముసుగుతొడిగారు. రోడ్ల నిర్మాణం కోసమంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఐతే లక్షల కోట్ల ఘనపు మీటర్ల మట్టితో ఏ కాలనీని మెరకచేశారు. ఎక్కడెక్కడ రోడ్లు వేశారు? అసలు తీసుకున్న అనుమతులెంత? అడ్డదిడ్డంగా తవ్వేసుకున్నదెంత? ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదు సంవత్సరాలపాటు సాగిన మట్టి దందాపై గనుల శాఖ అధికారులు లెక్కలు తెలుసుకుంటున్నారు.
ప్రైవేటు భూముల్లోనూ మట్టి తన్నుకుపోతున్న వైసీపీ గద్దలు- ప్రశ్నిస్తే బెదిరింపులు - Gravel mining
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మట్టి తవ్వకాలు, ఆదాయ తీరుతెన్నులపై అధికారులు దస్త్రాలు తిరగేస్తున్నారు. గనుల శాఖ లెక్కల ప్రకారం ఒక ఎకరంలో ఒక మీటరు లోతున తవ్వితే 400 టిప్పర్ల గ్రావెల్ వస్తుంది. విజయవాడ శివారులో ఒక టిప్పరు గ్రావెల్ 8 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. దాని ప్రకారం ఎకరం మట్టి తవ్వితే 32 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. టిప్పర్ల బాడుగ, ఇతర ఖర్చులు సగానికి సగం తీసినా 16 లక్షల రూపాయల మేర మిగులుతుంది. అనుమతులు తీసుకుని తవ్వితే ఘనపు మీటరుకు 109 రూపాయల చొప్పున గనుల శాఖకు చెల్లించాలి. అంటే ఎకరాకు 4 లక్షల 36 వేల చొప్పున గనుల శాఖకు రాయల్టీ చెల్లించాలి.
గత ఐదేళ్లలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గోరంత అనుమతులు తీసుకుని కొండంత తవ్వకాలు జరిపారు. వందల ఎకరాల్లో గ్రావెల్ తవ్వేసుకెళ్లి వందల కోట్లలో ప్రభుత్వానికి రాయల్టీ ఎగవేశారు. జగనన్న కాలనీల పేరుతో ఆసలు రాయల్టీయే లేకుండా తవ్వుకెళ్లారు. ఎక్కువగా విజయవాడ పరిసరాల్లో తవ్వకాలు జరిగాయి. గన్నవరం పరిధిలో ఏ కొండ చూసినా మట్టి తవ్విన ఆనవాళ్లే. విజయవాడ గ్రామీణం, గన్నవరం, బాపులపాడు మండలాల్లో ప్రభుత్వ బంజరులు, అటవీ, రెవెన్యూ భూమి, చెరువులతోపాటు పోలవరం కుడికాలువ వెంట కూడా మట్టి తవ్వుకెళ్లారు.