ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్ - Venkata Reddy Arrest - VENKATA REDDY ARREST

Mines Department Ex Director Venkata Reddy Arrest: గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక, ఖనిజ, గనుల దోపిడీకి సహకరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డిని ఏసీబీ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన పరారీలో ఉన్నారు. గనుల శాఖకు సంబంధించిన టెండర్లు, ఒప్పందాలు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. గనుల శాఖ ఫిర్యాదు మేరకు ఈనెల 11న మాజీ డైరెక్టర్‌ వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసింది. ఇవాళ విజయవాడకు తరలించి కోర్టులో హాజరుపర్చనుంది.

Mines Department Ex Director Venkata Reddy Arrest
Mines Department Ex Director Venkata Reddy Arrest (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 10:36 AM IST

Mines Department Ex Director Venkata Reddy Arrest :వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక, గనులు, ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశారు. జగన్‌ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2 వేల 566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని తేల్చింది. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది.

ఇసుక తవ్వకాల్లో గుత్తేదారు సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని గుర్తించింది. ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల గుత్తేదారులు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారని నిర్ధరించింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన్ను అరెస్టు చేసింది.

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై ఏసీబీ ఫోకస్ - విచారణకు ప్రభుత్వం అనుమతి - ACB Inquiry on Venkata Reddy

చంద్రబాబు బాధ్యుడంటూ తప్పుడు ఫిర్యాదు :ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసరైన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలోగనుల శాఖ సంచాలకునిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఏపీఎండీసీకి ఎండీగానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు పోస్టులను అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ పెద్దల గనుల, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. అంతేకాదు 2014 -19 మధ్య తెదేపా హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని దీనికి చంద్రబాబు బాధ్యుడంటూ తప్పుడు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై సీఐడీలో అక్రమంగా కేసు నమోదు చేయించారు.

వైఎస్సార్సీపీ అధికారం చేపట్టాక తొలుత ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యాక ప్రైవేటు గుత్తేదారులకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండరు దక్కేలా నిబంధనలు సిద్ధం చేసి వారికే కట్టబెట్టారు. ఇసుక గుత్తేదారు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు

చర్యలు తీసుకోని వెంకటరెడ్డి : ఇసుక రీచ్‌ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి. ఆ అక్రమాలకు వెంకటరెడ్డి సహకరించారు. ఆ సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించారు. దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్నాయి. ఒప్పందం ప్రకారం ప్రతినెలా 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేటు సంస్థలు టెండరులో కోట్‌ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. వారు నెలల తరబడి సొమ్ము జమచేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేపీవీఎల్‌ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబరు వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు.

వైఎస్సార్సీపీ ఇసుక దోపిడీకి వెంకటరెడ్డి సహకారం - జేపీ పవర్‌ వెంచర్స్‌కు 6 నెలల గడువు పొడిగింపు - JP Company Sand Mining Deadline

2023 డిసెంబరు నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారు. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఏకంగా 921 కోట్ల 51 లక్షల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి. ఈ దోపిడీకి వెంకటరెడ్డి సహకరించారు. గనుల లీజులు ఆన్‌లైన్‌ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారు. వైఎస్సార్సీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్‌లైన్‌ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనులశాఖ నిర్వహించిన సీనరేజ్‌ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చారు.

వైఎస్సార్సీపీ పెద్దలకు చెందిన సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారు. గనులశాఖలో ఎంతో మంది అధికారులు వెంకటరెడ్డి బాధితులే. ఆయన చెప్పినట్లు వినని, అడ్డగోలుగా సంతకాలు చేయబోమని చెప్పిన అధికారులకు ప్రాధాన్యంలేని పోస్టులకు, ఇతర శాఖలకు బలవంతంగా పంపేశారు. వర్కింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరిట ఓ చోట పోస్టింగ్‌ ఉంటే సుదూరంగా వేరొక చోట విధులు కేటాయించారు. రాయలసీమకు చెందిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోస్తా జిల్లాలకు చెందినోళ్లకు రాయలసీమకు ఇలా పంపేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో వీజీ వెంకటరెడ్డి ఏ-1గా ఉన్నారు. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధి అనిల్‌ ఆత్మారామ్‌ కామత్ ఏ-2, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతినిధి పి.అనిల్‌కుమార్ ఏ-3, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రతినిధి ఆర్‌.వెంకట కృష్ణారెడ్డి ఏ-4, జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఏ-5 ఇలా ఇతరులు నిందితులుగా ఉన్నారు. వీరందరు కలిసి సాగించిన నేరపూరిత కుట్ర వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

గనులు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు- ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సస్పెన్షన్ - Govt suspends Venkata Reddy

ABOUT THE AUTHOR

...view details