Impressive Cars and Helicopter Water Tanks :తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది. పట్టణానికి కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో నిత్యం జనం వస్తుంటారు. ఇక్కడ పని చేసే తాపీ మేస్త్రీలు ఎక్కువే. పేరుకే కాదు విభిన్న రీతుల్లో ఆకృతులను చేపట్టి తమదైన ముద్రను వేస్తుంటారు. ఇళ్లపై కారు, హెలికాప్టర్, చైనాలోని నిర్మాణ ఆకృతులను పోలిన నీటి ట్యాంకులను రూపొందించి చూపరులను ఆకట్టుకుంటున్నారు. నిజమైన కారు ఇంటిపైకి ఎలా ఎక్కిందా, ఇంత చిన్న స్థలంలో హెలికాప్టర్ ఎలా దిగిందనే సందేహం స్థానికుల్లో కలిగేలా చేసి అబ్బురపరిచేలా నిర్మాణాలు చేపడుతున్నారు.
ఆయా ప్రాంతాల్లో తమ ఇంటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే ఆలోచనతో ఈ కళాఖండాలను ఇంటిపై నిర్మించుకున్నామని యజమానులు చెబుతున్నారు. ఫలానా వారి ఇల్లు ఎక్కడ అనగానే ఇంటిపై కారు ఉంది. ఇంటిపై హెలికాప్టర్ ఉందనే లాండ్ మార్క్‌ని చూపడానికే ఇలా వివిధ ఆకృతులు చేయించుకున్నట్లు యజమానులు చెబుతున్నారు. వారు చేసే వృత్తి అనుగుణంగా తగిన గుర్తింపు ఉండాలని ఖర్చు ఎక్కువైనా వివిధ ఆకృతుల్లో నీటి ట్యాంకులను ఏర్పాటు చేయించుకున్నారు. వానకు తడిచి, ఎండకు ఎండటంతో కొంత మేర రంగు వెలిచిపోవడంతో ఏయేటికాయేడు రంగులను వేస్తూ వాటి అందాన్ని కాపాడుతున్నారు.